US Elections 2024 Voters : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసియా అమెరికన్ ఓటర్లు ప్రధాన పాత్ర పోషించనున్నారు. అభ్యర్థుల విజయావకాశాలను ఆసియా అమెరికన్లు ప్రభావం చేసే అకాశం ఉందని అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల్లో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ సహా ఆసియా దేశాలకు చెందిన అమెరికన్ ఓటర్లు కీలకంగా మారారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విజయానికి ప్రధాన పాత్ర పోషించిన ఆసియా అమెరికన్ ఓట్లు మరోసారి కీలకంగా మరనున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆసియా అమెరికన్ల ఓటర్లలో ఎక్కువ మంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆసియా అమెరికన్ల మద్దతు పొందడంలో వెనుకబడ్డారని పేర్కొన్నాయి. ట్రంప్ విధానాలు సంపన్నులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయని ఆసియా అమెరికన్ ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్‌పై నాకు బలమైన వ్యతిరేక భావాలు ఉన్నాయి. ఆయన దేశాన్ని(అమెరికా) వెనక్కి తీసుకువెళతారని అనుకుంటున్నాను. ఆయన (ట్రంప్) వలసదారులు, తక్కువ ఆదాయ ప్రజలు, సీనియర్లు, శ్రామిక కుటుంబాల అవసరాలపై దృష్టి పెట్టరు. ఆయన (ట్రంప్) విధానాలు సంపన్నులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తాయి.
- జెరెమీ లీ, ఆసియా అమెరికన్ ఓటరు
ఆసియా అమెరికన్ల ఓటర్లలో 66 శాతం మంది కమలా హారిస్‌కే తమ మద్దతు ఇచ్చినట్లు AAPI నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 28 శాతం మంది ట్రంప్‌నకు మద్దతు ఇవ్వగా, మరో ఆరు శాతం మంది ఎటూ తేల్చుకోలేక పోతున్నామని పేర్కొన్నట్లు సర్వే చెప్పింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిలో రేసులో ఉన్న సమయంలో ఏప్రిల్-మేలో నిర్వహించిన సర్వేలో డెమోక్రటిక్ పార్టీకి 46 శాతం మంది ఆసియా అమెరికన్ల మద్దతు ఉండగా..అదే కమలా అభ్యర్థిగా ఖరారైన తర్వాత 66 శాతానికి పెరిగినట్లు AAPI పేర్కొంది.