2024 United States Presidential Election :అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడం, కమలా హారిస్ పోటీలోకి రావడం వల్ల అక్కడి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. కమలా హారిస్‌పై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి దీటుగా జో బెడైన్, కమలా హారిస్ సైతం ట్రంప్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండు పార్టీలు తమ ప్రచారంలో జోరును పెంచాయి. మొత్తం 50 రాష్టాలున్న అమెరికాలో 7 రాష్ట్రాలు కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఈ రాష్ట్రాలు అమెరికా అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయిస్తాయి. అవే అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాలు. దీంతో అక్కడి తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి.
అరిజోనా రాష్ట్రం : 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్ల విజయంలో అరిజోనా రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీ కంచుకోటగా ఉన్న అరిజోనా గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ వైపు మొగ్గు చూపింది. 1990 తర్వాత తొలిసారి డెమొక్రట్లకు మద్దతిచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో మరోసారి డెమొక్రట్ల వైపు ఉంటుందా లేక రిపబ్లికన్లకు మద్దతిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అరిజోనాలోని ప్రధాన సమస్యలలో వలసలు ఒకటి. ఆ రాష్ట్రానికి మెక్సికోతో సుదీర్ఘ సరిహద్దు ఉంది. సరిహద్దు నుంచి అక్రమ వలసలు తగ్గినప్పటికీ ఇమ్మిగ్రేషన్ సమస్య చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాను తిరిగి అధ్యక్ష పదవిని దక్కించుకుంటే అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ చర్యను అమలు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో మెక్సికోతో సరిహద్దు సంక్షోభాన్ని నిర్వహించడంలో కమలా హారిస్ పాత్రపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అరిజోనాలో మరో వివాదాస్పద సమస్య అబార్షన్. అబార్షన్ హక్కులపై ఆ రాష్ట్రం తీవ్ర చర్చకు కేంద్ర బిందువుగా ఉంది. తమకు అధికారం ఇస్తే అబార్షన్లపై 160 ఏళ్ల నాటి నిషేధాన్ని పునరుద్ధరిస్తామని రిపబ్లికన్ పార్టీ పేర్కొంది. 2022లో అమెరికా సుప్రీంకోర్టు అబార్షన్ హక్కులకు సంబంధించి రాజ్యాంగ రక్షణలకు ముగింపు పలికింది. అరిజోనాలో ఈ సమస్యలు అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.
జార్జియా : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించగల మరొక రాష్ట్రం జార్జియా. అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఆఫ్రికన్-అమెరికన్ నివాసితులు అక్కడ ఉన్నారు. 2020లో బైడెన్ గెలుపులో వీరంతా కీలక పాత్ర పోషించారు. అయితే నల్లజాతి ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ పట్ల ఈ దఫా నిరాశతో ఉన్నట్టు తెలుస్తోంది. అది కమలా హారిస్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశమున్నట్టు సమాచారం. దీంతో ఆఫ్రికన్-అమెరికాన్ ఓట్లను రాబట్టేందుకు కమలా హారిస్ ప్రచార బృందం తీవ్రంగా యత్నిస్తోంది.
మిచిగాన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక రాష్ట్రం మిచిగాన్. గత రెండు ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన వారి వైపే మిచిగాన్ ఓటర్లు మొగ్గు చూపారు. మిచిగాన్‌లో ఎక్కువగా అరబ్-అమెరికన్ జనాభా ఉంటుంది. గాజాతో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు బైడెన్ మద్దతివ్వడంపై వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా ఎన్నికల్లో కీలకమైన మిచిగాన్ ప్రాముఖ్యతను గ్రహించిన ట్రంప్. ఇజ్రాయెల్, గాజా వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు. గాజాలో యుద్ధాన్ని ఆపాలని ఇప్పటికే ఇజ్రాయెల్‌ను ట్రంప్ కోరారు. మిచిగాన్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెండు పార్టీలు దృష్టి సారిస్తున్నాయి.
నెవాడా : మరో స్వింగ్ స్టేట్ నెవాడాలో ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో ఓటర్లు డెముక్రటిక్ పార్టీకి మద్దతిచ్చారు. అయితే ఈ ఏడాది రిపబ్లికన్లకు ఓట్లు పడొచ్చని తెలుస్తోంది. ముందస్తు పోల్స్‌లో నెవాడాలో బైడెన్ కంటే ట్రంప్‌కు ఎక్కువ మద్దతు దక్కింది. కమలా హారిస్ రాకతో అది కొంత మేర తగ్గిందని సమాచారం. నెవాడాలోని ప్రధాన సమస్యలలో ఆర్థిక వ్యవస్థ ఒకటి. బైడెన్ ఆధ్వర్యంలో బలమైన జాతీయ ఆర్థిక వృద్ధి, ఉద్యోగ కల్పన ఉన్నప్పటికీ, కోవిడ్ అనంతరం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నెవాడా వెనుకబడి ఉంది. అమెరికాలో కాలిఫోర్నియా, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా తర్వాత నెవాడాలో నిరుద్యోగ రేటు అత్యధికంగా 5.1 శాతం ఉంది. ఈ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నెవాడా ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి తక్కువ పన్నులు, తక్కువ నిబంధనల వంటి వాగ్దానాలను ట్రంప్ చేస్తున్నారు. రెండు పార్టీలు కూడా నెవాడాలోని గణనీయమైన లాటినో జనాభాపై దృష్టి సారిస్తున్నాయి.