తెలంగాణ

telangana

మాటల యుద్ధానికి కమలా హారిస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధం- విజయం ఎవరిదో? - Donald Trump vs Kamala Harris

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 4:13 PM IST

Updated : Sep 10, 2024, 4:57 PM IST

Donald Trump vs Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమొక్రటిక్‌, రిపబ్లికన్‌ అభ్యర్థులు కమలాహారిస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య తొలి టీవీ డిబేట్‌కు సర్వం సిద్ధమైంది. భారత్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఆరున్నరకు డిబేట్‌ మొదలుకానుంది. ట్రంప్‌ వాగ్ధాటిని హారిస్‌ ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తి నెలకొంది. ట్రంప్‌లోని దురుసు ప్రవర్తనను బయటకు తీసే దిశగా హారిస్‌కు ఆమె బృందం శిక్షణ ఇచ్చింది. ఓ మాక్‌ టెలివిజన్‌ వేదికను ఏర్పాటు చేసి ట్రంప్‌ను పోలిన వ్యక్తితో ఆమె ఇప్పటికే పలుమార్లు సంవాదం చేసినట్లు సమాచారం.

Donald Trump vs Kamala Harris
Donald Trump vs Kamala Harris (Associated Press)

Donald Trump vs Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమొక్రాట్, రిపబ్లికన్‌ అభ్యర్థులు కమలా హారిస్, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య తొలి ప్రత్యక్ష సంవాదానికి రంగం సిద్ధమైంది. ఈ డిబేట్‌ను అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్‌ ఫిలడెల్ఫియాలోని నేషనల్‌ కాన్‌స్టిట్యూషన్‌ సెంటర్‌లో అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 9.00 గంటలకు నిర్వహించనుంది. న్యూస్‌ స్టూడియోలో ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు. ఏబీసీ న్యూస్‌ యాంకర్లు డేవిడ్‌ ముయిర్, లిన్సే డేవిస్‌ చర్చకు కోఆర్డినేటర్లుగా ఉంటారు. 90 నిమిషాల పాటు చర్చ జరగనుంది. మధ్యలో రెండు సార్లు స్వల్ప విరామం ఉంటుంది. డిబేట్‌ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిస్తారు.

అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో ఎప్పుడూ కూడా అభ్యర్థులు పాలసీలు ప్రకటించి గెలవలేదని ఏబీసీ న్యూస్‌ తెలిపింది. తాను ఇప్పటి వరకు ఆరు అధ్యక్ష ఎన్నికలను కవర్ చేశానని, ఒక అభ్యర్ధి అద్భుతమైన విధాన ప్రతిపాదన చేసిన విజేతగా నిలిచిన దాఖలాలు ఎప్పుడూ కనిపించలేదని వార్తాసంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ చర్చలో ఏబీసీ న్యూస్ మోడరేటర్లు ట్రంప్, హారిస్‌ను పన్ను తగ్గింపులు విదేశీ వ్యవహారాల గురించి తీవ్రమైన ప్రశ్నలు అడుగుతారని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. డిబేట్‌ను చూసే ప్రేక్షకులను ప్రత్యర్థులపై వేసే ఛలోక్తులు, విమర్శలే ఆకట్టుకుంటాయని అందుకే, పాలసీ నిర్ణయాలను చర్చించడంపై ట్రంప్‌ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయలేదని, బదులుగా ప్రదర్శన ఆకట్టుకునేలా ఉండేలా జాగ్రత్తపడుతున్నట్లు ఆయన సలహాదారు వెల్లడించినట్లు సమాచారం.

ట్రంప్‌కు ఇప్పటివరకు ఆరుసార్లు డిబేట్‌లో పాల్గొన్న అనుభవం ఉంది. ఐతే కమలా హారిస్‌కు ఇదే తొలిసారి. ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో ఆకట్టుకోలేక విమర్శలపాలైన జో బైడెన్‌ వైదొలిగిన తర్వాత అనూహ్య పరిస్థితుల్లో కమలా హారిస్‌ బరిలో నిలవడంతో ఆమెకు రిహార్సల్స్‌ చేయడానికి కూడా ఎక్కువ సమయం సరిపోలేదు. ఇంత తక్కువ సమయంలో ఆమె ట్రంప్‌ వంటి మంచివక్తను ఢీకొట్టడం సాహసమనే చెప్పాలి. ట్రంప్‌లా కాకుండా హారిస్‌ గత వారమంతా పాలసీపై దృష్టి సారించారు.

ట్రంప్‌ ధాటిని హారిస్‌ తట్టుకునేందుకు ఆమె బృందం ఎన్నో చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే డిబేట్‌పై ఆమెకు అవగాహన కల్పించేందుకు, ఒక మాక్‌ టెలివిజన్‌ వేదికను ఏర్పాటు చేసి హారిస్‌కు శిక్షణ ఇచ్చారు. నిజమైన స్టూడియోలో ఉండే విధంగా పోడియం, లైటింగ్‌ను తీర్చిదిద్దారు. ట్రంప్‌ స్థానంలో ఒక సలహాదారు నిలుచుని ఆమెతో వాగ్వాదం చేశారు. ట్రంప్‌ ధరించిన బాక్సీ సూట్లు, రెడ్‌ కలర్‌ టైని ఆ వ్యక్తి ధరించినట్లు తెలిసింది. ఇలా చేయడం వల్ల హారిస్‌కు ఏబీసీ న్యూస్‌ స్టూడియో లోపల సౌకర్యంగా ఉంటుందని వారు భావిస్తున్నారు. ట్రంప్‌ డిబేట్లకు సంబంధించిన పాత వీడియోలను అన్నిటినీ ఆ బృందం సమీక్షించింది. ఎలాంటి సందర్భాల్లో ట్రంప్‌ ఎలా స్పందించారు. ఎక్కడ దెబ్బతిన్నారు వంటి అంశాల్ని పరిశీలించారు. ట్రంప్‌ను చికాకు తెప్పించేందుకు ఈ డిబేట్‌లో ట్రంప్‌ వయసు పైబడిన వ్యక్తి, ఆయనవి పాత కాల ఆలోచనలు అన్న పదాలను హారిస్‌ ఉపయోగించనున్నట్లు సమాచారం.

బైడెన్, ట్రంప్​ మాటల యుద్ధం- లైవ్​​ డిబేట్​లో వాడివేడిగా ...

'కమలా హారిస్‌ కాదు, ట్రంప్‌ గెలిస్తేనే భారత్‌కు మంచిది!' - US Presidential Elections

Last Updated : Sep 10, 2024, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details