No Flowers Rule in Tirumala : తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ కొండపైన భక్తులు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిలో తిరుమల కొండపైన ఎవ్వరూ పూలు ధరించరాదు అనే నియమం ఉంది. కొండపై భక్తుల పుష్పాలంకరణ నిషిద్ధం అన్న విషయం మీకు తెలుసా? దీనికి ఓ బలమైన కారణం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణం ఏంటంటే?
కొండపై కుసుమాలన్నీ శ్రీవారివే : శ్రీవేంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడన్న విషయం తెలిసిందే. అందుకే కొండపై పూసిన పూవులన్నీ ఆ శ్రీనివాసుడికే చెందాలనేది ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే కొండపైన ఎవరూ పూలు ధరించరు. అయితే దీనికి పూరాణాల్లో ఇంకో కథ ప్రచారం ఉంది. పూర్వం తిరుమలేశుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చే వారు. వారు అత్యంత భక్తిశ్రద్ధలతో వాటిని తీసుకుని ఆడవాళ్లయితే తలలో, మగవాళ్లు చెవిలో పెట్టుకునే వారు.
పరిమళ ద్రోహం జరిగింది : ఓసారి శ్రీశైలపూర్ణుడు అనే ఓ పూజారి శిష్యుడు శ్రీనివాసుడికి అలంకరించాల్సిన పువ్వులను తాను అలంకరించుకున్నాడట. ఇక ఆ రాత్రి ఏడుకొండల వాడు ఆ పూజారి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని ఆగ్రహించారట. విషయం తెలుసుకున్న శ్రీశైలపూర్ణుడు ఎంతగానో బాధపడ్డాడు. అంతే అప్పటి నుంచి కొండపైన ఉన్న పూలన్నీ స్వామి పాద సేవకేననే నియమం మొదలైంది. అంతే కాదు.. స్వామికి అలంకరించిన పూవులను భక్తులకు ఇవ్వకుండా పూలబావిలో వేసే ఆచారం మొదలైంది.
గుడికి ఇలా వెళ్లాలి : అయినా అలంకార ప్రియుడైన వేంకటేశ్వర స్వామి ముందు భక్తుల అలంకరణలు ఏపాటివి? ఆ కలియుగ వైకుంఠిడి ముందు అతిసాధారణంగా భక్తులు కనిపించాలని గుర్తు చేసేందుకే పూలు ధరించకూడదన్న నియమం అమల్లోకి వచ్చింది. అంతే కాదు ఆలయాలకు వెళ్లేటప్పుడు ఆడంబరంగా వెళ్లకుండా వీలైనంత సాధారణంగా, నిరాడంబంరగా ఉండటమే మంచిదని పండితులు చెబుతున్నారు. అప్పుడే భగవంతుడిపై మనసు మళ్లి ఏకాగ్రత కుదురుతుంది. ఇక తిరుమలలో పూలబావిలో వేసిన పువ్వులతో అగరువత్తులు తయారు చేస్తున్నారు.