US Citizenship Indian : అమెరికాలో 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పౌరసత్వాలు పొందిన రెండో దేశంగా నిలిచింది భారత్. 59,000 మందికి పైగా భారతీయులు గతేడాదిలో అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఈ జాబితాలో మెక్సికో తొలి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్) వార్షిక నివేదిక తెలిపింది. దీని ప్రకారం సెప్టెంబర్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8.7లక్షల మంది అమెరికా పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఇందులో 1.1లక్షల మంది మెక్సికో పౌరులు ఉండగా, 59,100తో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో 44,800 మందితో ఫిలిప్పీన్స్, 35,200తో డొమినికన్ రిపబ్లిక్ ఉంది. అంతకుముందు ఏడాది కూడా తొలి రెండు స్థానాల్లో మెక్సికో, భారత్ ఉన్నాయి.
అయితే, అమెరికా పౌరసత్వం దక్కాలంటే అనేక నిబంధనలు (america citizenship process) ఉంటాయి. అమెరికా వలస, జాతీయ చట్టం ప్రకారం అర్హత ఉన్నవారికే కేటాయిస్తారు. సుమారు ఐదేళ్ల పాటు అమెరికాలో చట్టబద్ధంగా నివాసం ఉండాలి. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు, సైనిక సేవలో ఉన్నవారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. 2023లో పౌరసత్వం పొందిన వారిలో అత్యధికులు ఐదేళ్ల చట్టబద్ధ నివాసం నిబంధన కిందే దరఖాస్తు చేసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది.