Ukraine Claims To Control 1000 Sq kms Of Russian Territory : రష్యాలోని కస్క్ ప్రాంతంలో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్‌స్కీ తెలిపారు. అలాగే కస్క్‌లో ప్రస్తుత పరిస్థితిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి వివరించారు. ఇరు దేశాల బలగాల మధ్య యుద్ధం సాగుతోందని వెల్లడించారు.
ఫస్ట్ టైమ్
రష్యాలోకి తమ సేనలు అడుగుపెట్టినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొదటిసారి ధ్రువీకరించారు. కస్క్‌లో పోరాడుతున్న సైనిక సిబ్బందిని ఆయన అభినందించారు. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని తెలిపారు. అటు కీవ్ బలగాల చొరబాటును, ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో తమ సైనికులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఉన్నత స్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్, ఆగస్టు 6న ఉక్రెయిన్ దాడులు మొదలైనట్లు తెలిపారు. భవిష్యత్తులో యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.