తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎన్నికల ముందు రిషి సునాక్‌కు షాక్- ప్రధాని పీఠంపైనా ప్రభావం! - uk election 2024 - UK ELECTION 2024

UK Bye Election Results : సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు గట్టి షాక్​ తగిలింది. స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల్లో సునాక్‌ పార్టీ కన్జర్వేటివ్‌కు ప్రతికూల ఫలితాలు రావడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది.

UK Election 2024
UK Election 2024 (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 3:37 PM IST

UK Bye Election Results :బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఎన్నికల సమీపిస్తున్న వేళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్‌ కన్జర్వేటివ్‌ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చాయి. స్థానిక ఎన్నికలు, కీలకమైన ఉపఎన్నికల వ్యతిరేక ఫలితాలతో ఆయనపై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్‌ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు సునాక్‌ ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలను కన్జర్వేటివ్‌ పార్టీ ఖండించింది.

టోరీల మెజార్టీ తారుమారు
బ్లాక్‌పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్‌పూల్‌ సౌత్‌ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం ఓ ప్రకంపన అని లేబర్ నాయకుడు సర్ కీర్ స్టార్‌మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న సాధారణ ఎన్నికల ముందు వచ్చిన ఈ ఫలితాలు లేబర్‌ పార్టీకి అనుకూలంగా మారాయన్నారు. ఈ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్లాక్‌పూల్‌లో వచ్చిన ఫలితాల గురించి దేశం మొతం మాట్లాడుకుంటుందని, రిషి సునాక్, కన్జర్వేటివ్‌లకు ఓటర్లు నేరుగా సందేశం పంపారని ఆ పార్టీ నేత స్టార్‌మర్‌ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తమ ఓటుతో సునాక్​ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రజలు స్పష్టం చేశారని తెలిపారు. రిషి సునాక్​కు స్పష్టమైన సందేశం అందిందని, ఇది మార్పునకు సమయమని స్టార్‌మర్‌ అభిప్రాయపడ్డారు.

రికార్డు మెజార్టీతో
బ్లాక్‌పూల్ సౌత్‌లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్‌పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్‌ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్‌ తెలిపారు.

ఏ ప్రాంతాలకు జరిగిందంటే?
ఈ ఉప ఎన్నిక ఇంగ్లాండ్, వేల్స్ చుట్టూ ఉన్న స్థానిక సంస్థలకు జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు తమ స్థానిక కౌన్సిలర్లను ఎన్నుకున్నారు. ఈ వారాంతం వరకు ఈ ఫలితాలు వెలువడుతూనే ఉంటాయి. వచ్చే ఆదివారం నాటికి ఇక్కడ ఫలితాలపై ఓ స్పష్టత వస్తుంది. ఈ ఎన్నికల్లో టోరీలు వందలాది సీట్లను కోల్పోయేలా కనిపిస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సంప్రదాయ టోరీ ఓటర్లు, బ్రెగ్జిట్‌కు మద్దతు ఇస్తున్న UK ఇండిపెండెన్స్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు కన్జర్వేటివ్‌లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

లండన్‌ మేయర్‌గా మళ్లీ ఆయనే!
లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారాంతంలో లండన్‌ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్‌ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వెల్లడించారు. టీస్ వ్యాలీ, వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని టోరీ మేయర్‌లు తమ స్థానాలను నిలబెట్టుకోవచ్చని తెలుస్తోంది. గ్రేటర్ మాంచెస్టర్, లివర్‌పూల్ సిటీలో కూడా కన్జర్వేటివ్‌లకు కాస్త సానుకూలంగా ఉంది. ఈస్ట్ మిడ్‌లాండ్స్, నార్త్ ఈస్ట్, యార్క్‌షైర్‌, నార్త్ యార్క్‌షైర్‌ మేయర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details