తెలంగాణ

telangana

ETV Bharat / international

మెక్సికో, కెనడాకు ట్రంఫ్ రిలీఫ్- నెల రోజులపాటు టారిఫ్ బాదుడు బంద్! - TRUMP TARIFFS ON MEXICO

అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట

Trump
Trump (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2025, 7:06 AM IST

Updated : Feb 4, 2025, 8:33 AM IST

Trump Tariffs On Mexico :అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో స్నేహపూర్వక ఫోన్‌ కాల్‌ తర్వాత ఈ మేరకు అంగీకారానికి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. ఇదే విషయాన్ని తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేశారు.

సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు. ఫోన్‌కాల్ విషయాన్ని మెక్సికో అధ్యక్షురాలు షీన్‌బామ్‌ ఎక్స్ వేదికగా తెలిపారు. మెక్సికో నుంచి అమెరికాకు మాదకద్రవ్యాలు, ముఖ్యంగా ఫెంటానిల్‌ అక్రమ రవాణా, అక్రమ వలసదారుల చొరబాట్లను కట్టడి చేసేందుకు వెంటనే 10 వేల మంది సైన్యాన్ని ఉత్తర సరిహద్దుకు తరలించనున్నట్లు షీన్‌బామ్‌ తెలిపారు. అందుకోసం బోర్డర్ పాలసీలలో పలు మార్పులు చేసినట్టు చెప్పారు.

అగ్రరాజ్యం సైతం మెక్సికోకు ఆయుధాల అక్రమ రవాణా నిరోధానికి కట్టుబడి ఉన్నట్లు వెల్లడించిందన్నారు ట్రంప్. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సరిహద్దు భద్రతపై చర్యలు తీసుకుంటామని ఆయన ట్రంప్‌నకు హామీ ఇచ్చారు. మరోవైపు నేటి నుంచి సుంకాల విధింపు అమల్లోకి రానున్న నేపథ్యంలో చైనా దిగుమతులపై అమెరికా టారిఫ్‌ విధించే అవకాశం ఉంది.

అయితే తాజా నిర్ణయంపై ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ హర్షం వ్యక్తంచేశారు. "అధ్యక్షుడు ట్రంప్‌తో మంచి సంభాషణ జరిగింది. సరిహద్దుల భద్రత కోసం 1.3 బిలియన్‌ డాలర్ల ప్రణాళికను అమలుచేస్తున్నాం. అమెరికన్‌ బలగాల భాగస్వామ్యంతో సరిహద్దుల్లో కొత్త సాంకేతికతను అమలుచేస్తాం. సిబ్బందిని పెంచుతాం. కొత్త ఛాపర్లను మోహరిస్తాం. ఫెంటనిల్‌ రవాణాను ఆపేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. సరిహద్దు రక్షణ కోసం 10వేల మంది బలగాలు పంపిస్తాం. దీంతోపాటు ఫెంటనిల్‌ జార్‌ను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మత్తు పదార్థాన్ని సరఫరా చేసేవారిని ఉగ్రవాదులుగా పరిగణిస్తాం. వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్‌, ఫెంటనిల్‌పై పోరాటానికి కెనడా-యూఎస్‌ జాయింట్‌ స్ట్రయిక్‌ ఫోర్స్‌ను ఏర్పాటుచేస్తాం. మేం కలిసి పనిచేసే వరకు ప్రతిపాదించిన టారిఫ్‌లు కనీసం 30 రోజుల పాటు నిలిపివేసేందుకు అంగీకారం కుదిరింది" అని ట్రూడో రాసుకొచ్చారు.

చైనాతో కటీఫ్‌ చేసుకోవాల్సిందే!
ట్రంప్‌ యంత్రాంగం పనామా కాలువ విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం పనామాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగమంత్రి మార్క్‌ రుబియో పనామా కాలువపై చైనా ప్రభావాన్ని తగ్గించాలని పేర్కొన్నారు. అలా చేయకపోతే తమ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని గట్టిగా హెచ్చరించారు. పనామా అధ్యక్షుడు జోస్‌ రౌల్‌ మోలినోతో రుబియో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ సందేశాన్ని నేరుగా మోలినోకు వినిపించారు. పనామా కాలువపై చైనా ప్రభావం ఏమాత్రం ఉండకూడదని స్పష్టంచేశారు.

చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకంలో పనామా భాగస్వామిగా ఉంది. ఈ ఒప్పందాన్ని మళ్లీ పునరుద్ధరించుకోబోమని ఇప్పటికే పనామా అధ్యక్షుడు మోలినో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్త చల్లారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుబియోతో సమావేశానంతరం మోలినో మాట్లాడుతూ, చర్చలు చాలా గౌరవప్రదంగా, సానుకూలంగా జరిగాయని చెప్పారు. పనామా కాలువకు ఎలాంటి ముప్పు లేదని అన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ, పనామా కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికాకు ట్రంప్‌ హెచ్చరిక
చైనాపై సుంకాలు విధించిన ట్రంప్‌ చూపు ఇప్పుడు దక్షిణాఫ్రికాపై పడింది. ఆ దేశానికి అమెరికా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. దక్షిణాఫ్రికా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అన్నారు. కొన్ని వర్గాల ప్రజల భూములను జప్తు చేస్తోందని ట్రంప్‌ ఆరోపించారు. దీనిపై తాము పూర్తిస్థాయి విచారణ చేస్తామని, అప్పటి వరకు ఆ దేశానికి నిధులు ఆపేస్తామని స్పష్టం చేశారు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం స్పందించింది. తాము తెచ్చిన కొత్త చట్టాన్ని ట్రంప్‌ యంత్రాంగం సరిగ్గా అర్థం చేసుకోలేదని పేర్కొంది. దశాబ్దాలుగా సాగిన మైనారిటీ తెల్లజాతీయుల వివక్ష పాలన కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులుపడ్డారని పేర్కొంది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకే ఓ చట్టాన్ని తెచ్చామని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఎవరి భూములనూ జప్తు చేయడం లేదని తెలిపారు. దక్షిణాఫ్రికాలో పుట్టిన బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ కూడా రమాఫోసా ప్రభుత్వం తెల్లజాతీయులను వేధింపులకు గురిచేస్తోందని గతంలో ఆరోపించారు.

Last Updated : Feb 4, 2025, 8:33 AM IST

ABOUT THE AUTHOR

...view details