తెలంగాణ

telangana

ETV Bharat / international

డొనాల్డ్ ట్రంప్ 2.0 తగ్గేదేలే! తొలిరోజే కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు - DONALD TRUMP EXECUTIVE ORDERS

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్- డజన్లకొద్దీ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకాలు

Trump Executive Orders 2025
Trump Executive Orders 2025 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2025, 11:22 AM IST

Trump Executive Orders 2025 :అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పదవి చేపట్టగానే తనదైన స్టైల్‌లో పాలన ప్రారంభించారు. ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు. తొలి ఎనిమిది ఆదేశాలపై సంతకం చేసిన అనంతరం పెన్నును జనంలోకి విసిరేసి వారిని సంతోషపరిచారు.

78 ఆర్డర్లు వెనక్కి!
అలాగే మాజీ అధ్యక్షుడు బైడెన్‌ జారీ చేసిన 78 ఆదేశాలను వెనక్కి తీసుకొన్నారు డొనాల్డ్ ట్రంప్. ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం, వాక్‌ స్వేచ్ఛకు రక్షణ, దీంతోపాటు జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టిపెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు, ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరుకావాలన్న ఆర్డర్లు అందులో ఉన్నాయి.

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అమెరికా వైదొలగింది. కొవిడ్‌ వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్ఓ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్నారు ట్రంప్. ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
  • ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విస్తరణను నియంత్రిస్తూ మాజీ అధ్యక్షుడు బైడెన్‌ జారీ చేసిన ఆదేశాలను తొలగించారు ట్రంప్‌. గత అధ్యక్షుడి హయాంలో ఏఐ అభివృద్ధి, ప్రయోగాలపై నియంత్రణలు ఉండేవి. తాజాగా వాటిని ట్రంప్ తొలగించారు.
  • సరిహద్దు గోడ సామగ్రిని విక్రయించాలన్న బైడెన్‌ ఆదేశాలను ట్రంప్‌ వెనక్కి తీసుకోవాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు.
  • చైనా కంపెనీ టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కారు 75 రోజుల సమయం ఇచ్చింది. యూఎస్​కు ఆ యాప్‌లో 50శాతం వాటా ఉండాలని ట్రంప్‌ తెలిపారు. వాస్తవానికి టిక్‌టాక్‌ పేరెంట్‌ కంపెనీకి దీనిని విక్రయించేందుకు జనవరి 19 వరకు గడువు ఇచ్చింది.
  • బైడెన్‌ కార్యవర్గం వాక్‌ స్వేచ్ఛపై నియంత్రణ విధించడంపై కూడా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
  • అలాగే ఈవీలపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం టెస్లా అధినేత మస్క్‌కు షాక్‌ ఇచ్చింది. 2030 నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం 50శాతం ఈవీలు ఉండాలంటూ బైడెన్‌ తీసుకొన్న నిర్ణయాన్ని ట్రంప్‌ తొలగించారు.
  • అలాగే ఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం డెనాలికి మౌంట్ మెకిన్లీగా పేరు మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడి పేరు మీద శిఖరానికి ఈ పేరు పెట్టారు.
  • వాతావరణ మార్పులకు సంబంధించిన కీలకమైన పారిస్‌ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. నూతన అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణం చేసిన అనంతరం ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.
  • కెనడా, మెక్సికోలపై అదనపు సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇరుదేశాలపై 25శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు తెలిపారు.
  • ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరుకావాలని ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు.
  • ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ ట్రంప్ ఆర్డర్ జారీ చేశారు. అయితే, మిలిటరీ, మరికొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది.
  • పాలనపై పట్టుసాధించే వరకు అధికారులు కొత్తగా ఎలాంటి నియంత్రణలు విధించే అవకాశం లేకుండా నిరోధించే ఆర్డర్​పై ట్రంప్ సంతకం చేశారు.

ABOUT THE AUTHOR

...view details