తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం - హాజరుకానున్న అతిరథమహారథులు - భారత్ నుంచి ఎవరంటే? - DONALD TRUMP INAUGURATION

ట్రంప్ 2.0కు సర్వం సిద్ధం - క్యాపిటల్‌ హిల్‌లోని రోటుండా వద్ద భద్రత కట్టుదిట్టం - హాజరుకానున్న వివిధ దేశాధినేతలు, ప్రముఖులు!

Donald Trump
Donald Trump (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2025, 8:13 PM IST

Donald Trump Inauguration :అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. వాషింగ్టన్ డీసీలో ఉన్న క్యాపిటల్‌ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో సోమవారం ట్రంప్​ ప్రమాణం చేయనున్నారు. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ట్రంప్‌ ఇప్పటికే తన కుటుంబంతో కలిసి ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ చేరుకున్నారు. అక్కడ 100 మంది ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. వారిలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దంపతులు కూడా పాల్గొన్నారు.

అమెరికా ఐక్యతపైనే ప్రారంభోపన్యాసం
సాధారణంగా క్యాపిటల్‌ భవనం మెట్లపై అధ్యక్షులుగా ప్రమాణం చేస్తుంటారు. అయితే అతిశీతల వాతావరణం కారణంగా బహిరంగ ప్రదేశంలో కాకుండా ఇండోర్ ఆవరణలో ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. దీంతో ఆ ప్రాంతాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 25వేల మందితో ఫెడరల్ అధికారులు భద్రత ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం తొలుత సెయింట్‌ జాన్స్‌ ఎపిస్కోపల్‌ చర్చిలో ట్రంప్‌ ప్రార్థనలు చేయనున్నారు. అక్కడి నుంచి శ్వేతసౌధానికి వెళ్లి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. తర్వాత క్యాపిటల్‌ హిల్‌కు చేరుకుంటారు. భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్‌తో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణం చేశాక ట్రంప్‌ ప్రారంభోపన్యాసం ఇవ్వనున్నారు. అమెరికా ఐక్యతే థీమ్‌గా తన ఉపన్యాసం ఉంటుందని ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అనంతరం కాంగ్రెస్‌లో జరిగే విందులో పాల్గొంటారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రోజంతా సంగీత కార్యక్రమాలతో పాటు పరేడ్‌లను నిర్వహించనున్నారు.

భారత్​ నుంచి వీళ్లే
ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో కూడా అంబానీ దంపతులు పాల్గొననున్నారు. అంబానీ కుటుంబానికి ట్రంప్ కుటుంబం ప్రత్యేకంగా ఆహ్వానం పంపిందని ఓ వార్తా సంస్థ తెలిపింది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, సీఈఓ జెఫ్ బెజోస్‌, ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌లు కూడా హాజరుకున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరుకానున్నారు. పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ జీతం ఎంత? ఆ దేశాధినేతలతో పోలిస్తే అంత తక్కువా!

అధ్యక్షుడిగా తొలిరోజే 100 సంతకాలు- డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ డే ప్లాన్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details