Trump Praised Tim Walz : అమెరికాలో పోలీసుల కర్కశత్వానికి బలైన జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎన్నికల సందర్భంగా నాటి ఘటనను గుర్తుచేస్తూ అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో అప్పటి మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ విఫలమయ్యారని డొనాల్డ్ ట్రంప్ సహా ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఆడియో మాత్రం అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం. ఈ ఆడియోలో ట్రంప్ స్వయంగా టిమ్ వాల్జ్‌ను ప్రశసిస్తున్నట్లుగా ఉంది. టిమ్ వాల్జ్‌ను డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నాటి ఘటనలను ఉద్దేశిస్తూ, అల్లర్లను నియంత్రించేందుకు అధ్యక్ష హోదాలో ఉన్న తాను అప్పట్లో కేంద్ర బలగాలను పంపినట్లు తెలిపారు. లేదంటే ఈ రోజు మినియాపోలీస్ ఉనికిలోనే ఉండేది కాదన్నారు. గవర్నర్‌గా ఉన్న వాల్జ్ అలసత్వం వహించారని, అందువల్లే నగరం అట్టుడికిపోయిందని ఆరోపించారు. ఆ సమయంలో తాను గనక అధ్యక్షుడిగా ఉండి ఉండకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని పేర్కొన్నారు. నగర మేయర్ విజ్ఞప్తి చేసినప్పటికీ వాల్జ్ స్పందించలేదని ఆరోపించారు. ఫలితంగా చాలా పోలీసు స్టేషన్లు మంటల్లో దగ్ధమయ్యాయని, అనేక మంది పోలీసులు దాడులకు గురయ్యారని చెప్పారు. వాన్స్ సైతం తన వంతుగా ట్రంప్ వాదనను ఎన్నికల ప్రచారాల్లో ఉటంకిస్తున్నారు.