తెలంగాణ

telangana

ETV Bharat / international

పనామా కెనాల్​పై చైనా నియంత్రణ సహించం - సైనిక చర్యను తోసిపుచ్చలేం: డొనాల్డ్​ ట్రంప్​ - TRUMP ABOUT PANAMA CANAL

గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చేస్తాం - గ్రీన్‌లాండ్‌‌ను ఇవ్వకుంటే డెన్మార్క్‌పై భారీ టారిఫ్​లు తప్పవ్​ - డొనాల్డ్​ ట్రంప్​ హెచ్చరిక

Trump
Trump (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2025, 9:07 AM IST

Trump About Panama Canal : కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పనామా కెనాల్, గ్రీన్‌లాండ్‌లను అమెరికా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సైనికశక్తిని వినియోగించే అంశాన్ని తోసిపుచ్చలేనని పేర్కొన్నారు. ఆ రెండు కూడా ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా ప్రధానమైనవని ట్రంప్ తెలిపారు. ఫ్లోరిడాలోని మారా లాగోలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘పనామా కెనాల్, గ్రీన్‌లాండ్‌లను నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సైనికశక్తిని ప్రయోగిస్తారా?’’ అని విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ పై సమాధానమిచ్చారు.

ఒకే ఒక డాలరుకు ఇచ్చేస్తారా?
‘‘పనామా కెనాల్ మా దేశానికి చాలా ముఖ్యం. కానీ దాన్ని చైనా నిర్వహిస్తోంది. మేం పనామా కెనాల్‌ను పనామాకు ఇచ్చాం. కానీ చైనాకు ఇవ్వలేదు’’ అని ఆయన చెప్పారు. మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒకే ఒక డాలరుకు పనామా కెనాల్‌ను పనామాకు ఇచ్చేయడాన్ని చాలా పెద్ద తప్పిదంగా ట్రంప్ అభివర్ణించారు. ‘‘పనామా కెనాల్ వల్ల అమెరికా 38వేల మందిని కోల్పోయింది. అప్పట్లో దాని నిర్మాణానికి 1 ట్రిలియన్ డాలర్ల దాకా ఖర్చుపెట్టాం’’ అని ఆయన వివరించారు. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం గ్రీన్‌లాండ్‌పై నియంత్రణ సాధించడం అమెరికాకు అవసరమన్నారు ట్రంప్​. ‘‘గ్రీన్‌లాండ్‌లో దాదాపు 45వేల మంది ప్రజలు ఉన్నారు. డెన్మార్క్ దేశానికి తమపై అధికారం ఉందని కూడా చాలా మంది గ్రీన్‌లాండ్ ప్రజలకు తెలియదు. ఒకవేళ వాళ్లు ఈ విషయాన్ని తెలుసుకున్నా ఇక మర్చిపోవాలి. ఎందుకంటే అమెరికా భద్రత కోసం గ్రీన్‌లాండ్ కావాలి’’ అని ట్రంప్ వెల్లడించారు.

గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును మార్చేస్తా!
‘‘గ్రీన్‌లాండ్‌ కచ్చితంగా అమెరికాకే దక్కాలి. లేదంటే దాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్‌పై భారీగా వాణిజ్య టారిఫ్‌లు విధిస్తాను. గ్రీన్‌లాండ్‌ను నియంత్రణలోకి తెచ్చుకోవడంపై నా దగ్గర సమగ్రమైన ప్లాన్ ఉంది’’ అని ట్రంప్ వెల్లడించారు. ‘‘ప్రపంచంలో ఎక్కడ చూసినా చైనా నౌకలు, రష్యా నౌకలే కనిపిస్తున్నాయి. అయినా మేం వాళ్లను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాం’’ అని ఆయన చెప్పారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ట్రంప్ తెలిపారు. ఆ విధంగా పేరు మార్చడం న్యాయమైన చర్యేనని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details