Trump Attacks Harris :అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ నోరుకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో డెమొక్రాట్ల అభ్యర్థి కమలాహారిస్‌పై ట్రంప్ మళ్లీ వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమె భయంకరంగా నవ్వుతారని వ్యాఖ్యానించారు. హారిస్ నవ్వుపై నిషేధం ఉందని, అందుకే ఆమె నోరు మూస్కుని తిరుగుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె నవ్వితే చూడాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. చూడటానికి హారిస్ కన్నా తానే చాలా అందంగా ఉంటానని ట్రంప్ గొప్పలకు పోయారు.
ఇటీవల, టైమ్ మ్యాగజిన్ కవర్ పేజీపై కమలా హారిస్ చిత్రాన్ని ముద్రించడంపైనా ట్రంప్ ఇలాంటి దురంహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫొటోలు సరిగ్గా ఉండనందున, కవర్ పేజీపై కమల చిత్రాన్ని స్కెచ్ ఆర్టిస్ట్‌తో వేయించారన్నారు. కమల ఏ విషయాన్నైనా చెత్తగా చెబుతారని విమర్శించారు. తాను బైడెన్‌కు వ్యతిరేకంగా బరిలోకి దిగానని ఇప్పుడు అసలెవరో తెలియని వ్యక్తిపై పోటీ చేస్తున్నానని కమలాహారిస్‌ను చులకన చేసి మాట్లాడారు. 'హూ ద హెల్ హారిస్, హూ ఈజ్ షి' అంటూ గద్దించారు.
హారిస్ స్వభావాన్ని రాడికల్ లిబరల్గా ట్రంప్ అభివర్ణించారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీకే నష్టమని రిపబ్లికన్ల నుంచి హెచ్చరికలు వచ్చినప్పటికీ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవడం లేదు. కమలా హారిస్‌ను కమబ్లా, లిన్ కమలా, లాఫిన్ కమలా వంటి అసభ్యకర పేర్లతో సంభోదిస్తున్నారు. గతంలో షికాగోలో జరిగిన సభలోనూ కమలా హారిస్ భారతీయురాలా, నల్లజాతీయురాలా అంటూ ట్రంప్ నోరుపారేసుకున్నారు. పైగా కమలాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తన హక్కు అని ట్రంప్ ఇటీవల అన్నారు.