Trudeau On Nijjar Killing Arrests :ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు వ్యవహారంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడాలో చట్టబద్ధమైన పాలన; స్వతంత్ర, బలమైన న్యాయవ్యవస్థ ఉందని అన్నారు. తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. హర్దీప్‌సింగ్ హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని ట్రూడో తెలిపారు. కెనడాలో ఉన్న ప్రతి వ్యక్తికి భద్రతతో జీవించే హక్కు ఉందన్నారు. వివక్షాపూరిత, హింసాయుత వాతావరణం నుంచి రక్షణ వారి హక్కు అని వ్యాఖ్యానించారు. నిజ్జర్ మృతి తర్వాత కెనడాలోని ఓ వర్గం అభద్రతతో జీవిస్తోందని ట్రూడో అభిప్రాయపడ్డారు.
కెనడా అంతర్గత వ్యవహారం : జై శంకర్
తాజాగా ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ స్పందించారు. కెనడా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు భారతీయుల సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తుందని జైశంకర్ తెలిపారు. అరెస్టుల వార్తలను తాను చూశానని చెప్పారు. వారు భారత్ నుంచి, ప్రత్యేకంగా పంజాబ్ నుంచి, కెనడాలో వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు నిర్వహించారన్న సమాచారం ఉందా అని జై శంకర్ ప్రశ్నించారు. అరెస్టయిన ముగ్గురు భారతీయులకు సంబంధించి కెనడా అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం పొందాలని భావిస్తున్నట్లు కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ వర్మ తెలిపారు. కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు జరిపిన పరిశోధనల ఫలితంగానే అరెస్టులు జరిగాయని అర్థం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారం కెనడా అంతర్గతమని వ్యాఖ్యానించారు.