తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హెజ్‌బొల్లా నం.2 ఇబ్రహీం అకీల్​​ హతం! - Hezbollah Commander Ibrahim Killed - HEZBOLLAH COMMANDER IBRAHIM KILLED

Top Hezbollah Commander Ibrahim Akil Killed : ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లాను దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. మంగళ, బుధవారాల్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో హెజ్‌బొల్లా శ్రేణుల్లో వణుకు పుట్టించిన ఇజ్రాయెల్‌, శుక్రవారం లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో హెజ్‌బొల్లా నం.2 ఇబ్రహీం అకీల్​​ హతం అయినట్లు తెలుస్తోంది.

Hezbollah Commander Ibrahim Akil
Hezbollah Commander Ibrahim Akil (AP)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 6:50 AM IST

Top Hezbollah Commander Ibrahim Akil Killed :ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లాను దెబ్బ మీద దెబ్బ తీస్తోంది. కనీసం కోలుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఊహించని రీతిలో హెజ్​బొల్లాపై విరుచుకుపడుతోంది. మంగళ, బుధవారాల్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో హెజ్‌బొల్లా శ్రేణుల్లో వణుకు పుట్టించిన ఇజ్రాయెల్‌, శుక్రవారం ఏకంగా లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో హెజ్‌బొల్లా నం.2 నేత ఇబ్రహీం అకీల్ సహా, మరో 12 మంది సీనియర్లు ప్రాణాలు కోల్పోయారని సమాచారం. అంతేకాదు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే సీనియర్‌ కమాండర్‌ ఇబ్రహీం అకీల్​ మృతిని హెజ్‌బొల్లా ఇంకా ధ్రువీకరించలేదు.

ఇజ్రాయెల్‌ దాడి చేసిన భవనంలోనే ఇబ్రహీం అకీల్‌ ఉన్నారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. గతంలో హెజ్‌బొల్లా ప్రత్యేక దళం రద్వాన్‌కు ఇబ్రహీం అకీల్‌ నేతృత్వం వహించారు. ఆ మిలిటెంట్‌ సంస్థ అత్యున్నత మండలి జిహాద్‌ కౌన్సిల్‌కు కూడా ఆయన నాయకత్వం వహించారు. ప్రస్తుతం హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా తర్వాతి స్థానంలో అంటే నంబర్​2 పొజిషన్​లో అకీల్​ ఉన్నారు. అకీల్‌పై యూఎస్​ 80ల్లోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో ఈ సైనిక కమాండర్‌ కీలక పాత్ర పోషించారు. అకీల్‌ ఆచూకీ తెలిపితే 7 మిలియన్‌ డాలర్లు ఇస్తామని కూడా అగ్రరాజ్యం ప్రకటించింది. ఇప్పుడు అకీల్‌ హతమైన దహియా ప్రాంతంలోనే హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ అయిన ఝక్ర్‌ను జులై నెలలో ఇజ్రాయెల్‌ మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

1000 రాకెట్లు ధ్వంసం!
బీరుట్‌ దాడికి ముందు ఇజ్రాయెల్, హెజ్‌బొల్లాలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. గురువారం దక్షిణ లెబనాన్‌లోని వంద రాకెట్‌ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను యుద్ధ విమానాలతో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఐడీఎఫ్‌ వెల్లడించింది. అలాగే హెజ్‌బొల్లా స్థావరాలపైనా విరుచుకుపడినట్లు పేర్కొంది. ఇందుకు ప్రతిగా ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా 140 రాకెట్లను ప్రయోగించింది.

ఇక ఆపరేషన్‌ లెబనాన్‌
గాజా నుంచి ఇటీవల తన దృష్టిని హెజ్‌బొల్లాపై మళ్లించిన ఇజ్రాయెల్‌, ఇప్పుడు లెబనాన్‌పై పూర్తిస్తాయి దాడికి సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన తన ప్రణాళికను ఇప్పటికే అమెరికాకు తెలిపినట్లు సమాచారం. లెబనాన్‌లో మంగళవారం పేజర్లు పేలిన సమయంలోనే ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి గలాంట్‌, అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌కు ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా 'ఆపరేషన్‌ లెబనాన్‌' గురించి తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే గాజా నుంచి కీలక సైనిక యూనిట్లను లెబనాన్‌ సరిహద్దులకు టెల్‌ అవీవ్‌ తరలించింది. భారీ స్థాయిలో ట్యాంకర్లను కూడా మోహరించింది. ఏ క్షణమైనా లెబనాన్‌ భూభాగంలోకి ఇజ్రాయెల్‌ సేనలు ప్రవేశించే అవకాశం ఉంది. లెబనాన్‌లో పేజర్లు పేలిన అనంతరం ఇజ్రాయెల్‌-అమెరికా రక్షణ మంత్రులు నాలుగు సార్లు ఫోన్​లో సంభాషించుకున్నారు. ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో పెంటగాన్‌ అధికార ప్రతినిధి సబ్రీనా సింగ్‌ ధ్రువీకరించారు. అయితే ఎప్పుడు మాట్లాడుకున్నారన్న వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. గలాంట్‌తో జరిగిన సంభాషణలో, ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుందన్న విషయాన్ని ఆస్టిన్‌ పునరుద్ఘాటించినట్లు మాత్రం తెలిపారు.

మృతదేహాలను కాళ్లతో తోసి
వెస్ట్‌బ్యాంక్‌లోని కబాటియాలో ఓ బహుళ అంతస్తుల భవనంపై నుంచి 3 మృతదేహాలను ఇజ్రాయెల్‌ సైనికులు కిందకు తోస్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. మృతదేహాలు భవనం పైనుంచి కిందకు పడుతున్న దృశ్యాలను అసోసియేటెట్‌ ప్రెస్‌ పాత్రికేయుడు చిత్రీకరించారు. "ఇది చాలా తీవ్రమైన విషయం. మా సైన్యం పాటించే విలువలకు ఇది విరుద్ధం" అని ఈ ఘటనపై ఓ ఇజ్రాయెల్‌ సైనికాధికారి స్పందించారు. దీనిపై తాము విచారణ జరుపుతున్నామని తెలిపారు. గురువారం కబాటియాలో ఇజ్రాయెల్‌ సైన్యం సోదాలు నిర్వహించి, నలుగురు మిలిటెంట్లను హతమార్చింది. అయితే ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ ధ్రువీకరించలేదు. ఓ వ్యక్తి చనిపోయారని, ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పుల్లో 10 మంది గాయపడ్డారని, వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

ఇజ్రాయెల్​పై హెజ్​బొల్లా రివెంజ్​ అటాక్- 100పైగా రాకెట్లతో మెరుపు దాడులు! - Hezbollah Rocket Attack On Israel

'యుద్ధం కొత్త దశ షురూ!' లెబనాన్‌లో పేలుళ్ల వేళ ఇజ్రాయెల్‌ ప్రకటన - Israel Lebanon War

ABOUT THE AUTHOR

...view details