Yunus Comments On Hasina : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్, మాజీ ప్రధాని షేక్ హసీనాను ఉద్దేశించి 'మాన్‌స్టర్ వెళ్లిపోయింది' అంటూ వ్యాఖ్యానించారు. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన ఆయన విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆందోళనలను ముందుండి నడిపించిన విద్యార్థి సంఘాల నాయకులను ప్రశంసించారు. ఇప్పటికే విద్యార్థి సంఘం నాయకులు నహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మద్‌లను 16 మంది సభ్యుల సలహా మండలిలో చేర్చుకున్నామని ఆయన అన్నారు.
"విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన విప్లపం మొత్తం ప్రభుత్వాన్నే కూల్చేసింది. నిరంకుశ పాలనకు ముగింపు పలికింది. దేశం నుంచి మాన్‌స్టర్ (రాక్షసి) వెళ్లిపోయింది. మిమ్మల్ని నేను గౌరవిస్తాను. మీరు తాత్కాలిక పరిపాలన బాధ్యతలు తీసుకొమ్మని కోరినందు వల్లే అంగీకరించాను’’ అని ముహమ్మద్ యూనస్ పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తిగా సయ్యద్ రెఫాత్ అహ్మద్ పేరును విద్యార్థి నాయకులు ప్రతిపాదించడంతో ఆయనను కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు ముహమ్మద్ యూనస్.
అదుపులోకి మాజీ మంత్రులు
బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీశాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ పలక్‌ను, విదేశాంగ మాజీ మంత్రి హసన్ మహమూద్‌ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్‌గా ఉన్న జియావుల్ అహ్‌సాన్‌పై కూడా ప్రభుత్వం వేటువేసింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం హసీనా భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.