తెలంగాణ

telangana

ETV Bharat / international

రెబల్స్‌పై సిరియా కౌంటర్ ఎటాక్‌ - అసద్‌కు అండగా నిలిచిన రష్యా

అసద్‌కు అండగా రంగంలోకి రష్యా - అలెప్పో, ఇద్లిబ్‌ నగరాలపై వైమానిక దాడులు

Syria Iran War
Syria Iran War (AP)

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2024, 6:54 AM IST

Syria Attack On Rebels :సిరియాలోని హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ సంస్థ నేతృత్వంలోని తిరుగుబాటుదారులపై సిరియా కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. సిరియాకు అండగా రష్యా కూడా రంగంలోకి దిగింది. తిరుగుబాటుదారుల నుంచి అలెప్పో నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారీ ఎత్తున వైమానిక దాడులు చేస్తోంది. ఆదివారం సిరియా జెట్‌ విమానాలు అలెప్పో, ఇడ్లిబ్ నగరాలపై చేసిన దాడిలో దాదాపు 15 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే సిరియాకు రాజకీయ, సైనిక మిత్రదేశంగా ఉన్న ఇరాన్‌, అసద్‌కు మద్దతు ఇస్తుందా, లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

జోరుమీదున్న రెబల్స్‌
మరోవైపుసిరియాలో హయాత్‌ తహరీర్‌ అల్‌-షామ్‌ సంస్థ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అలెప్పో నగరాన్ని ఆక్రమించిన ఉత్సాహంలో ఉన్న తిరుగుబాటుదారులు, ఇప్పుడు హమా పట్టణం వైపునకు దూసుకెళుతున్నారు. హమా చుట్టుపక్కల గ్రామాలను, పలు పట్టణాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. హమా సిరియాలోని నాలుగో అతి పెద్ద నగరం కావడం గమనార్హం.

సిరియాకు అండగా రష్యా
తిరుగుబాటుదారుల నుంచి సిరియాను రక్షించేందుకు రష్యా రంగంలోకి దిగింది. ఇద్లిబ్, అలెప్పో నగరాలపై భారీస్థాయిలో వైమానిక దాడులు ప్రారంభించింది. మళ్లీ పరిస్థితిని నియంత్రణలోకి తెచ్చుకొనేందుకు సిరియా ప్రభుత్వ బలగాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. తిరుగుబాటుదారులపై భీకరంగా వైమానికదాడులు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాము ఆక్రమించిన ప్రాంతాలపై తిరుగుబాటుదారులు నియంత్రణ కొనసాగించగలరా, లేదా అనేది చూడాలి. ఎందుకంటే సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ బలగాలకు ఆకాశ మార్గాలపై నియంత్రణ ఉంది. వాయు మార్గంలో దాడులు చేసే సత్తా ఉంది. ఈ నేపథ్యంలో సిరియాలో కొనసాగుతున్న ఈ దీర్ఘకాల అంతర్యుద్ధంలో, తిరుగుబాటుదారులు తాము ఆక్రమించిన ప్రాంతాలపై ఎంతకాలం పట్టు నిలుపుకొంటారన్నది కీలకం కానుంది. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు ఎంతటి భారీ దాడులు చేసినా చివరకు వారిని ఓడించి తీరుతామని అసద్‌ హెచ్చరించారు. సిరియా ప్రాదేశిక సమగ్రత, స్థిరత్వాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశారు. బుధవారం నుంచి జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో 300 మందికి పైగా చనిపోయారు.

ABOUT THE AUTHOR

...view details