Christmas Celebrations At ISS : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. సునీతా విలియమ్స్ సహా ఇతర వ్యోమగాములు సందేశం ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను నాసా పోస్టు చేసింది.
ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయారు. వచ్చే ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశముందని ఇటీవల నాసా వెల్లడించింది. సునీత, విల్‌మోర్ 8 రోజుల మిషన్‌లో భాగంగా జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి జూన్ 14వ తేదీనే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురై వారు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
మార్చి కంటే ముందు జరిగే అవకాశాలు లేవ్!
ఈ క్రమంలోనే స్పేస్ఎక్స్ క్రూ-9 అనే మిషన్‌ను ప్రయోగించింది. అందులో ఇద్దరు హాగ్, గోర్బునోవ్ వ్యోమగాములు ఉన్నారు. కాగా, అంతరిక్షంలో చిక్కుకున్నవారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు రెండు సీట్లు ఖాళీగా పంపించారు. ఇది సెప్టెంబరులోనే అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. దీంతో నలుగురు ఫిబ్రవరిలో తిరిగి వస్తారని నాసా తొలుత ప్రకటించింది. అయితే, క్రూ-9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు వెళ్లే క్రూ-10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశాలు కన్పించడం లేదు.
ముచ్చటగా మూడోసారి!
దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఆలోగా భూమి పైకి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. కాగా సునీతా విలియమ్స్‌కు ఇది ముచ్చటగా మూడో రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.