Israel Confirms killing Haniyeh : హమాస్ లీడర్ ఇస్మాయిల్ హనియా మీద దాడి చేసి అంతం చేసినట్లు ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. ఈ విషయాన్ని టెల్‌అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. అదే విధంగా హౌతీలపై కూడా దాడి చేస్తామని హెచ్చరించారు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని, వారి నాయకులకు శిరచ్ఛేధం చేస్తామని కాట్జ్ అన్నారు.
జులై 31న లెబనాన్ రాజధాని బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో హెజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్ ఫువాద్ షుక్ర్ మరణించారు. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత హమాస్ లీడర్ హనియాను కూడా ఇజ్రాయెల్ అంతం చేసింది.
"ఇటీవల కాలంలో హౌతీ ఉగ్రవాదులు- ఇజ్రాయెల్‌పై భారీగా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. అందుకే వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నా. హమాస్, హెజ్‌బొల్లాలను ఓడించాం. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం. సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంమే కాకుండా హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇక యెమెన్‌లోని హౌతీలకు కూడా తుదముట్టిస్తాం"
--కాట్జ్, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి
యెస్ - మేమే హతమార్చాం
యహ్నా సిన్వర్ అంతమైన తరువాత ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియా, అదే నగరంలో హత్యకు గురయ్యారు. పథకం ప్రకారమే ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని ఇరాన్ అప్పుడే ఆరోపించింది. అయితే, టెల్‌అవీవ్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈవిషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం.
తగ్గడం లేదు!
మరోవైపు గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తూనే ఉన్నారు. వీరికి ప్రధానంగా ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు మద్దతుగా వ్యవహరిస్తున్నామని హౌతీ తిరుగుబాటుదారులు చెబుతున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపే వరకు ఈ దాడులు కొనసాగిస్తామంటున్నారు. దీంతో హౌతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైనిక దళాలు ప్రతిదాడులు చేస్తున్నాయి.