Aksana Soltan Special Story : 'మాది అఫ్గానిస్తాన్‌లోని మజర్-ఎ-షరీఫ్ ప్రాంతం. మా తల్లిదండ్రులకు మొత్తం నలుగురు సంతానం. అందులో నేను చిన్నదాన్ని. నాకు ఇద్దరు అన్నయ్యలు, ఓ అక్క ఉంది. మా నాన్న ఇంజినీర్. నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న రోజులవి. బయట తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోందని మారుతున్న మా ఇంటి వాతావరణంతో అర్థమవుతోంది. ఇద్దరు అన్నయ్యలు స్కూల్‌కు వెళ్తుంటే, మా అక్క, నేను వాళ్లకు క్యారేజీలు కట్టిచ్చేవాళ్లం. నాకు ఏడేళ్ల వయసు వచ్చేసరికి మా అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెలా మా జీవితం కాకూడదని నిశ్చయించుకుంది. అంతే ఒక పాత సంచిలో కొన్ని పుస్తకాలు పెట్టి, నాకు మా అన్నయ్య డ్రస్ వేసి భయంభయంగా ఒక చోటుకి తీసుకెళ్లింది. అండర్ గ్రౌండ్‌లో నల్లటి కర్టెన్లతో ఉన్న ఆ చోటును చూసి మొదట్లో చాలా భయం వేసింది. కాసేపటి తర్వాత నాలాంటి అమ్మాయిలు మరికొందరు అక్కడ కనిపించారు.
అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. అదొక ఆడపిల్లల స్కూల్ అని. అక్కడ ఇద్దరు టీచర్లు ఉండగా, అందులో మా అమ్మ ఒకరు. ఈ రహస్య పాఠశాలకు నేను, మా అక్క అన్నయ్యల దుస్తులు వేసుకుని అబ్బాయిల్లా వెళ్లేవాళ్లం. వేర్వేరు దారుల్లో, వేర్వేరు సమయాల్లో మాత్రమే బడికి పోయేవాళ్లం. అలా చేస్తే ఇద్దరిలో ఒక్కరైనా దక్కుతారని మా అమ్మ ఆశ. ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రతిసారీ మా అమ్మ 'ఆడపిల్లకు పుస్తకమే ఆయుధం' అని ధైర్యం చెప్పి పంపించేది. నాతో సహా ఆ బడికి వచ్చే 50 మంది ఆడపిల్లలూ ప్రతిరోజూ ప్రాణాలు పణంగా పెట్టి వచ్చేవాళ్లం. కుర్చీలు, బల్లలు ఉండవు అక్కడ. అందరూ గుండ్రంగా కూర్చుని చప్పుడు చేయకుండా చదువుకునే వాళ్లం. రోజులు గడుస్తున్న కొద్దీ తాలిబన్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. దాంతో నాన్న జేబులో ఉన్న 2 డాలర్ల డబ్బుతో మా కుటుంబం మొత్తం దేశం దాటింది.
అమెరికాకు శరణార్థుల దండు.. కాలినడకనే పయనం.. టార్గెట్ అదే!
శరణార్థిగా :మొదట తజికిస్తాన్ శరణార్థి శిబిరంలో చేరాం. అక్కడ తిండి లేదు. మందులు లేవు, కరెంట్ సౌకర్యం లేదు. చదువు అసలే లేదు. నా చుట్టూ ఉన్న క్యాంపుల్లో మా లాంటి పిల్లలు చనిపోవడం మొదట్లో భయంగా అనిపించినా, తర్వాత సాధారణం అనిపించింది. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ వెళ్లాం. కాస్త అటూ, ఇటూగా అక్కడా అదే పరిస్థితి. అమ్మకొచ్చిన కుట్టు పని మమ్మల్ని పస్తులు ఉండకుండా అంతవరకూ కాపాడింది. నాన్న యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీలో మా కుటుంబాన్ని రిజిస్టర్ చేయించారు. దాంతో మా చదువులకు యునిసెఫ్ సాయం అందింది. అదే మా జీవితంలో వచ్చిన మంచి మార్పు. మాతో సహా మరో నలభై మందికి అమెరికాలో ఉండే అవకాశం వచ్చింది. 12 ఏళ్ల వయసులో రిచ్‌మండ్‌కి చేరుకున్నా. అక్కడ చదువుకుంటున్నా అన్న మాటే కానీ నా ఆలోచనల్లోంచి శరణార్థి జీవితం తాలూకు చేదు అనుభవాలు తొలగిపోలేదు.