Royal Family of Dubai : ఆయన ఇంటి ముందు విమానాలు ఎయిర్ పోర్టులో పార్కు చేసినట్టుగా ఉంటాయి..! ఆయన గ్యారేజీలో కార్లు చూస్తే.. షోరూమ్‌ల మేళా అనిపిస్తుంది..! బైకులు సైకిళ్ల మాదిరిగా స్టాండ్ వేసి ఉంటాయి..! అవును మరి.. ఆయన ఇంటి ఖరీదే అక్షరాలా 4 వేల కోట్ల రూపాయల పైచిలుకు విలువ చేస్తుంది. విలాసానికి నిలువెత్తు నిదర్శనంగా.. రాజసానికి సింబల్‌గా కనిపించే ఆ వ్యక్తి పేరు.. షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్. ఆయన ఎవరో కాదు.. యూఏఈ అధ్యక్షుడు. ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన కుటుంబంగా.. నహ్యాన్ ఫ్యామిలీ రికార్డు సృష్టించింది.
2023లోనే ఈ ఘనత అందుకుంది నహ్యాన్ కుటుంబం.
అప్పటి వరకూ రిచెస్ట్ ఫ్యామిలీగా ఉన్న వాల్టన్ కుటుంబాన్ని దాటేసి.. అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫ్యామిలీ నివసించే భవనాన్ని చూస్తే రెండు కళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఎంత ఊహించుకున్నా.. అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. అవును మరి.. ఒకటా రెండా? ఏకంగా 4 వేల కోట్ల పైచిలుకు విలువ చేసే భవంతి ఇది! వారికి ఇది ఒక్కటే కాదు.. యూఏఈలో ఎన్నో భవనాలు ఉన్నాయి. వాటన్నింటిలో ఈ రాజ కుటుంబం నివసించే భవనమే అతి పెద్దది. పేరు.. ఖాసర్ అల్ వాటన్. ఇది అబుదాబీలో ఉంది. అరబ్-ఇస్లామిక్ వాస్తుశిల్పంతో నిర్మించారు. ఈ భవనానికి 2015లో ప్రారంభోత్సవం చేశారు. ఇందులో అనేక దివాణాలు, సమావేశ మందిరాలు, అతిథి గదులు ఉన్నాయి. ఈ భవనంలో ఇవన్నీ కలిపి దాదాపు వెయ్యికి పైగా గదులు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది.
పెద్ద కుటుంబం..
ఈ రాజ భవనం.. పెంటగాన్ వైశాల్యాని కన్నా మూడు రెట్లు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. దాదాపు 94 ఎకరాల్లో ఈ భవంతి విస్తరించి ఉంది. దీని ఖచ్చితమైన విలువ రూ. 4,078 కోట్లు. షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ కుటుంబం చాలా పెద్దది. ఆయన ఫ్యామిలీలో 18 మంది అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లు 11 మంది ఉన్నారు. ఈ కుటుంబానికి నహ్యాన్ పెద్ద. ఈయనకు 9 మంది సంతానం. మనవలు, మనవరాళ్లు 18 మంది ఉన్నారు.
ప్రపంచ కుబేరుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్- ఒక్కసారిగా సంపద అంత పెరిగిందా! - donald trump net worth
ప్రపంచంలోని చమురు నిల్వల్లో..
ప్రపంచంలోని ఆయిల్ నిల్వల్లో.. దాదాపు ఆరు శాతం ఈ కుటుంబం ఆధ్వర్యంలోనే ఉన్నాయట! లండన్, పారిస్‌తోపాటు వరల్డ్‌లో చాలా ప్రాంతాల్లో వీరికి ఆస్తులు ఉన్నాయి. 2015 లెక్కల ప్రకారం చూస్తే.. లండన్‌లోని బ్రిటిష్ రాజకుటుంబంతో సమానంగా ఈ ఫ్యామిలికీ ఆస్తులు ఉన్నాయని అంచనా. ఈ మేరకు మీడియా కథనాలు వచ్చాయి. ఇవేకాకుండా.. వేల కోట్లు రూపాయలు విలువ చేసే నౌకలు, ప్రైవేటు విమానాలు, కార్లు(Cars), ఇతర వాహనాలు ఉన్నాయి. నహ్యాన్ సోదరుడి వద్ద దాదపు 700కు పైగా కారు కలెక్షన్ ఉంది. ఇందులో లగ్జరీ కార్లయిన లంబోర్గిని, బుగాటి, మెర్సిడెస్, బెంజ్ వంటి బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి.
మస్క్ కంపెనీలో షేర్లు..
ఈ రాజ కుటుంబానికి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఇనకమ్ గడిచిన ఐదేళ్ల కాలంలో ఏకంగా 28,000 శాతం పెరగడం గమనార్హం. 2008వ సంవత్సరంలో రూ.2,122 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ వీరి ఆధీనంలోనే ఉంది. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్‌లో, పాప్ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్ "ఫెంటీ"తో పాటు ఎన్నో ఫేమస్ కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. ఇదీ.. నహ్యాన్ కుటుంబ రాజసం తీరు. ఇంతకీ వీరి ఆస్తి మొత్తం ఎంతో చెప్పలేదు కదూ.. 2023లోనే 305 బిలియన్ డాలర్లు. అంటే.. మన లెక్కలో చెప్పాలంటే రూ.25,38,667 కోట్లు!