తెలంగాణ

telangana

సరదాగా వాకింగ్ చేద్దామని స్పేస్​లోకి 'బిలియనీర్'- ఎలాన్ మస్క్​ రాకెట్​లో క్రేజీ టూర్ - SpaceX Private Spacewalk

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 3:52 PM IST

Updated : Sep 10, 2024, 5:05 PM IST

SpaceX Private Spacewalk : ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్‌ చేయడానికి నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది.

SpaceX Private Spacewalk
SpaceX Private Spacewalk (Associated Press)

SpaceX Private Spacewalk : అంతరిక్షంలో తొలిసారి ప్రైవేటు స్పేస్‌వాక్‌ నిర్వహించేందుకు గాను ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ 'పోలారిస్‌ డాన్​'ను ప్రయోగించింది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి దూసుకెళ్లిన ఫాల్కన్‌-9 రాకెట్​ ద్వారా నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది. పోలారిస్‌ డాన్ మిషన్‌కు వ్యాపారవేత్త, బిలియనీర్ జేర్డ్‌ ఇస్సాక్‌మన్‌ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మాజీ ఉద్యోగి స్కాట్‌ కిడ్‌ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు స్పేస్‌ఎక్స్‌కు చెందిన మిషన్‌ ఇంజినీర్లు సారా గిల్లి, అన్నా మెనోన్‌ ఉన్నారు.

పోలారిస్ మిషన్‌లో ఇది మొదటి మానవసహిత యాత్రగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో పూర్తిగా స్పేస్‌ఎక్స్ పరికరాలనే వినియోగించారు. ఈ మిషన్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సమీపంలో ఆగదు. కానీ భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకెళ్లి భూప్రదక్షిణ చేయనుంది. ఈ ప్రాజెక్టును ఆగస్టు 27నే చేపట్టాల్సిన ఉన్నా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల అప్పుడు వాయిదా వేశారు. ఇప్పుడు ప్రయోగించారు.

పొలారిస్ డాన్ మిషన్ అంటే ఏమిటి?
పొలారిస్ డాన్ మిషన్ కింద క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు తక్కువ ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి వెళ్తారు. మిషన్ సమయంలో, వ్యోమగాములు కక్ష్యలో మొత్తం ఐదు రోజులు గడుపుతారు. మిషన్ లాంచ్ మూడో రోజున, ఇద్దరు వ్యోమగాములు క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి 15- 20 నిమిషాలపాటు స్పేస్‌వాక్ చేస్తారు. వ్యోమగాములు స్పేస్‌వాక్ చేసే మొదటి ప్రైవేట్ మిషన్ ఇదే. మిషన్ సమయంలో అనేక ఇతర పరీక్షలు కూడా జరగనున్నాయి.

అయితే స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ గత దశాబ్ద కాలంలో తొలిసారిగా ఫెయిలైంది. దీంతో ఆ రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోలేకపోయాయి. ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ ఉపగ్రహాలు తక్కువ కక్ష్యలోనే ఉండిపోయాయి. ఫాల్కన్ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే దాని అప్పర్ స్టేజీ ఇంజిన్‌లో లోపం తలెత్తి లిక్విడ్ ఆక్సిజన్ లీకవడం వల్ల ఇలా జరిగిందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది.

Last Updated : Sep 10, 2024, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details