SpaceX Polaris Dawn Launch On 26 : ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ ఆగస్టు 26న చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్‌వాక్‌ను నిర్వహించనుంది. ఈ ప్రాజెక్టుకు 'పోలారిస్ డాన్'గా పేరుపెట్టింది. ఈ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సుల్ సాయంతో భూకక్ష్యలోకి పంపనుంది. ఇందుకోసం ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ సెంటర్‌లో ఫాల్కన్-9 రాకెట్‌ను వినియోగించనున్నారు. ఈ మొత్తం మిషన్‌కు వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్‌మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్‌గా వ్యవహరిస్తారు.
ఈ 'పోలారిస్ డాన్' ప్రాజెక్ట్‌లో పాల్గొనే మిషన్ ఇంజినీర్లు సారా గిల్లి, అన్నా మెనోన్ స్పేస్‌ఎక్స్‌లో ఉద్యోగులు. ఈ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) సమీపంలో ఆగదు. కానీ, భూమికి దాదాపు 700 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యోమగాములను తీసుకెళ్లి, భూ ప్రదక్షిణ చేయనుంది. గతంలో అపోలో మిషన్లు మాత్రమే మానవులను అంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఆ తరువాత మరే ఇతర ప్రాజెక్టులు మానవులను ఇంత ఎత్తుకు తీసుకెళ్లలేదు. పోలారిస్ మిషన్‌లో తలపెట్టిన మూడు మానవసహిత యాత్రల్లో ఇది మొదటిది. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్‌ఎక్స్ పరికరాలనే వినియోగిస్తారు. మూడు యాత్రలకు ఇస్సాక్‌మన్ నిధులను సమకూరుస్తున్నారు.
గొప్ప ప్రయత్నం - కానీ
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ఘన చరిత్ర ఉంది. కానీ గత దశాబ్ద కాలంలో తొలిసారిగాస ఇది జులై నెలలో విఫలమైంది. దీంతో గురువారం రాత్రి ఆ రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 స్టార్ లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోలేకపోయాయి. ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ ఉపగ్రహాలు తక్కువ కక్ష్యలోనే ఉండిపోయాయి. ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే దాని అప్పర్ స్టేజీ ఇంజిన్‌లో లోపం తలెత్తి లిక్విడ్ ఆక్సిజన్ లీకవడం వల్ల ఇలా జరిగిందని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. "ఫాల్కన్ 9 రాకెట్ ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించిన వెంటనే మా కంపెనీ ఫ్లైట్ కంట్రోలర్లు దానిలోని దాదాపు సగం ఉపగ్రహాలతో కనెక్టయ్యారు. వాటిలోని అయాన్ థ్రస్టర్లను ఉపయోగించి శాటిలైట్లను ఎగువ కక్ష్యలోకి పంపేందుకు యత్నించినా సాధ్యపడలేదు" అని స్పేస్ ఎక్స్ తెలిపింది. తప్పుడు కక్ష్యలోకి చేరిన శాటిలైట్లు అక్కడికక్కడే కాలిపోతాయని స్పష్టం చేసింది. ఇంత జరిగినా ఎలాన్ మస్క్ వెనకడుగు వేయడం లేదు. సరికొత్త చరిత్ర సృష్టించేందుకు త్వరలోనే స్పేస్‌ఎక్స్ పోలారిస్ డాన్ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు.
'బంగ్లాదేశ్‌కు ఇది రెండో స్వాతంత్య్రం' - ముహమ్మద్ యూనుస్ - Bangladesh Second Independence
'ఇజ్రాయెల్ విషయంలో మాకు సపోర్ట్ ఇవ్వండి'- ముస్లిం దేశాలను కోరిన ఇరాన్ - OIC Holds Emergency Meeting