South Korea President Impeachment :దక్షిణ కొరియాలో రెండు వారాలుగా సాగుతున్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. గత శనివారం అభిసంశన తీర్మానంపై ఓటింగ్‌లో పాలకవర్గ సభ్యులు పాల్గొనకపోవడం వల్ల పదవీగండం నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ వారం వ్యవధిలో రెండోసారి ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటు వేశారు. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు.
అభిశంసన తీర్మానానికి సంబంధించిన ప్రతులను రాజ్యాంగ కోర్టు, యూన్ సుక్ యోల్‌కు వ్యక్తిగతంగా అందిన తర్వాత అధ్యక్షుడిగా ఆయనకు ఉన్న అధికారాలు, విధులు రద్దు కానున్నాయి. యూన్ సుక్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలా లేక అధికారాలను తిరిగి కట్టబెట్టాలా అని తీర్పు ఇవ్వడానికి ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానానికి 180 రోజుల గడువు ఉంటుంది. యూన్ సుక్‌కు వ్యతిరేకంగా రాజ్యాంగ కోర్టు తీర్పు వెలువరిస్తే 60 రోజుల్లోపు అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రధానమంత్రి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తారు.
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ ఈనెల 3న యూన్ సుక్ మార్షల్ లాను విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల పార్లమెంట్‌లో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించారు. ఫలితంగా గంటల వ్యవధిలోనే ఎమర్జెన్సీని ఎత్తివేశారు. అనంతరం ఆయనపై విపక్షాలు ఈనెల 7న పార్లమెంట్‌లో తొలిసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. 300 మంది సభ్యులున్న చట్టసభలో 200 మంది మద్దతు అవసరం కాగా, 195 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అందులో అధికార పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు.
తాజా ఓటింగ్‌లో 200కుపైగా ఓట్లు రావడంవల్ల ఆయనపై అనర్హత వేటు కత్తి వేలాడుతోంది. యూన్ సుక్‌ను అధ్యక్ష స్థానం నుంచి తప్పించి అరెస్టు చేయాలని ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవడం వల్ల మరింత మంది పాలకపక్ష ఎంపీలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
మరోవైపు, అభిశంసన తీర్మానం ఆమోదం పొందిన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తన కార్యాలయం ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటమిని అంగీకరించబోనని, రాజ్యాంగ కోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థిరత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.