Sheikh Hasina Political Career : బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, దాదాపు 20 ఏళ్లు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన షేక్ హసీనా అనుహ్య రీతిలో రాజీనామా చేయాల్సి వచ్చింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ఆమె తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని దేశం వీడక తప్పలేదు. 1996లో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా యత్నించారు. తర్వాత 2009లో తిరిగి బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా సోమవారం పదవికి రాజీనామా చేసే వరకు ఆ దేశ ప్రధానిగా కొనసాగారు. షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి.
షేక్ హసీనా ఎక్కువ కాలం బంగ్లాదేశ్‌ను పాలించిన నేతగా నిలిచారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ఓ ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన మహిళగా హసీనా నిలిచారు. బంగ్లాదేశ్‌కు తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ముజిబుర్ రెహ్మాన్ 1975లో హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు షేక్ హసీనా తల్లిని, ముగ్గురు సోదరులను కొందరు సైనికాధికారులు హత్య చేశారు. ఈ హత్యలు జరిగినప్పుడు హసీనా బంగ్లాదేశ్‌లో లేరు. ఆ సమయంలో హసీనా ఆరేళ్లు ప్రవాసంలో ఉండి అవామీ లీగ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు.
పలుమార్లు గృహనిర్బంధం
1981లో బంగ్లాదేశ్ తిరిగి వచ్చాక రాజకీయాల్లో కీలక నాయకురాలిగా ఎదిగారు. ఈ క్రమంలోనే పలుమార్లు గృహనిర్బంధానికి గురయ్యారు. 1990 డిసెంబర్‌లో ప్రజల ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ చివరి సైనిక పాలకుడు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. 1991లో జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా పార్టీ బరిలో నిలిచినప్పటికీ ఆధిక్యం దక్కలేదు. ఆమె ప్రత్యర్థి ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఖలీదాజియా పార్టీ ఎన్నికల్లో నిజాయితీగా వ్యవహరించలేదనీ హసీనా పార్లమెంటును బహిష్కరించారు. ఆ తర్వాత పలు హింసాత్మక ఘటనలు చెలరేగడం వల్ల చాలా కాలం రాజకీయ గందరగోళం నెలకొంది.
మొదటి పదవీకాలంలో రాజకీయ గందరగోళం
1996 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ విజయం సాధించగా, హసీనా తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు. బంగ్లాదేశ్ ఆర్థికంగా వృద్ధి చెందేందుకు కృషి చేశారు. పేదరికాన్ని తగ్గించేందుకు యత్నించారు. హసీనా మొదటి పదవీకాలం రాజకీయ గందరగోళం మధ్యే సాగింది. 2001 అక్టోబరులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖలీదా జియా నేతృత్వంలోని బీఎన్పీ, మూడు సంకీర్ణ భాగస్వామ్య పక్షాలతో అవామీ లీగ్‌ను ఓడించింది. దీంతో హసీనా పదవిని కోల్పోయారు.