2025 Sports Events : కొత్త ఏడాది వచ్చేసింది. అన్ని రంగాల్లోనూ నయా రికార్డులను తిరగరాసేందుకు ఎంతో మంది ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది క్రీడల్లో రాణించిన మన స్టార్స్ ఈ సారి కూడా ప్రపంచ వేదికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గతంలో ఘోరంగా విఫలమైన వారు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి ఇంతకీ ఆ ప్లేయర్లు ఎవరు? ఈ సారి క్రీడాభిమానులను అలరించనున్న ఈవెంట్స్ ఏంటో చూద్దామా :
అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు :
గతేడాది టీ20 ప్రపంచకప్ సాధించి ఐసీసీ టోర్నీల్లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది రోహిత్ సేన. ఇదే దూకుడుతో 2025లో మరో ఐసీసీ కప్ అందుకునేందుకు భారత్ ఉవ్విళ్లూరుతోంది. 8 ఏళ్ల తర్వాత వచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటైతే, మహిళల వన్డే ప్రపంచకప్ మరొకటి. ఇక అండర్-19 అమ్మాయిల టీ20 ప్రపంచకప్ కూడా జరగనుంది. వీటితో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (భారత్ అర్హత సాధిస్తే) కూడా ఉంది.
పురుషుల జట్టు పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియాతో ఈ నెల 3న జరగనున్న అయిదో టెస్టుతో టీమ్‌ఇండియా కొత్త ఏడాది ప్రారంభిస్తుంది. ఆ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. అది అయ్యాక జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటనకు టీమ్ఇండియా వెళ్లనుంది. ఆ మధ్యలో టీ20 మజాను అందించేందుకు ఐపీఎల్ ఎలాగో ఉంది.
ఇదిలా ఉండగా, మహిళల జట్టు జనవరి 10న ఐర్లాండ్‌తో జరగనున్న వన్డేతో ఏడాదిని మొదలెడుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. వీటితో పాటు ప్రపంచకప్‌లోనూ తలపడనుంది. మరోవైపు డబ్ల్యూపీఎల్ కూడా ఉంది.
చెస్‌లో మెయిన్ ఈవెంట్స్ ఇవే :
చెస్ అభిమానులకు 2024లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ సారి చెస్ ఒలింపియాడ్‌లో రెండు స్వర్ణాలు రావడం ఒక ఘనత అయితే 18 ఏళ్ల గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గడం, హంపి రెండో సారి ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలవడం మరో మైల్‌స్టోన్‌గా నిలిచింది. ఈ క్రమంలో 2025లోనూ తమ జోరును కొనసాగించేందుకు మన ఆటగాళ్లు గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. అర్జున్ ఇరిగేశి, గుకేశ్, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాత్, పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక, నిహాల్ సరీన్, వైశాలి, కోనేరు హంపి, దివ్య, తానియా, వంతిక తదితర స్టార్ ప్లేయర్లు చెస్‌పై తమ దండయాత్రను కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ఇక అండర్-20, క్యాడెట్, యూత్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, మహిళల ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలు, గ్రాండ్ ప్రి సిరీస్ తదితర టోర్నీలు ఈ సారి చెస్ అభిమానులకు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.
నీరజ్ 90మీ. అందుకునేనా?
స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాపై ఈ ఏడాది కూడా క్రీడాభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 90 మీటర్ల దూరాన్ని ఈ సారి అందుకోవాలనే కసితో ఉన్నాడు ఈ జావెలిన్ త్రో స్టార్. ఇప్పటివరకూ నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లుగా ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో రజతం తర్వాత గాయం నుంచి కోలుకునేందుకు సమయం తీసుకున్నప్పటికీ, దిగ్గజం యాన్ జెలెజ్నీని కొత్త కోచ్‌గా నియమించుకున్నాడు నీరజ్. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌తో పాటు ప్రతిష్ఠాత్మక డైమండ్స్ లీగ్ పోటీలు కూడా ఉన్నాయి. గతేడాది డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ రెండో స్థానంలో నిలవగా, నీరజ్‌ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇతర అథ్లెటిక్స్ క్రీడాంశాల్లోనూ భారత అథ్లెట్లు ఉత్తమ ప్రదర్శన చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా ఇదే జోరు కొనసాగించాలనే ఉత్సాహంతో ఉన్నారు.
కథ మారేనా?
2024లో బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. పారిస్ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో మన షట్లర్లందరూ ఈ కొత్త ఏడాదిలో కథ మార్చాలనే పట్టుదలతో ఉన్నారు. గతేడాది చివరిలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీలో విజేతగా నిలిచి టైటిళ్ల కరవుకు తెరదించిన స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాది కూడా జోరు కొనసాగించాలని చూస్తోంది. పెళ్లి తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టనుంది.
మరోవైపు డబుల్స్‌లో ఎప్పటికప్పుడూ చరిత్ర సృష్టిస్తూ సాగుతున్న సాత్విక్-చిరాగ్ జోడీ కూడా ఈ సారి కూడా రికార్డుల వేటకు సై అంటోంది. జనవరి 7న ప్రారంభం కానున్న మలేసియా ఓపెన్‌తో బ్యాడ్మింటన్ సీజన్‌కు తెర లేవనుంది. ఇక ఆ తర్వాత సూపర్ సిరీస్ టోర్నీలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌తో సందడిగా సాగనుంది.
గురి కుదిరిందంటే
ఇక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలతో దూసుకెళ్లిన షూటర్లు ఈ కొత్త ఏడాదిలోనూ అదే జోరును కొనసాగించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రపంచ షూటింగ్‌లో భారత ఆధిపత్యాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌తో పాటు ప్రపంచకప్‌ల్లోనూ పతక వేటకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మను బాకర్‌తో పాటు దివ్యాంశ్, అనీశ్, రుద్రాంక్ష్, సౌరభ్, ఇషా సింగ్ తదితర యువ షూటర్లపై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ఆరు షూటింగ్ ప్రపంచకప్‌లు జరుగుతాయి.
జకో Vs అల్కరాస్
కొత్త ఏడాదిని 25వ గ్రాండ్‌స్లామ్‌తో స్వాగతించేందుకు సిద్ధమయ్యాడు దిగ్గజ ఆటగాడు జకోవిచ్. ప్రస్తుతం 24 టైటిళ్లతో అత్యధిక విజయాల రికార్డులో మార్గరెట్ కోర్ట్‌తో సమంగా ఉన్న ఈ స్టార్ ప్లేయర్ మరో ట్రోఫీ గెలిస్తే పాతిక టైటిళ్లతో శిఖరాగ్రానికి చేరుతాడు. అయితే ఈ విజయం అంత సులువుగా దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. గతేడాది ఒలింపిక్ స్వర్ణంతో కల సాకారం చేసుకున్నప్పటికీ ఒక్క గ్రాండ్‌స్లామ్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేదు. అయితే తన కెరీర్‌లో ఓ ఏడాదిని గ్రాండ్‌స్లామ్ గెలవకుండా ముగించడం ఇది రెండోసారి మాత్రమే. ఇందుకు గాయాలు కూడా ఓ కారణం.
అయితే సినర్, అల్కరాస్ లాంటి కుర్రాళ్లు ఆధిపత్యం చలాయిస్తున్న వేళ జకో ఫామ్‌లోకి రావడం ఎంతో అవసరం. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో ఈ ఇద్దరూ చెరో రెండు పంచుకున్నారు. దీంతో ఈ ఏడాది కూడా వీళ్ల నుంచి జకోకు పోటీ తప్పదని తెలుస్తోంది. ఇక మహిళల సింగిల్స్‌లో పైచేయి ఎవరిదనేది వేచి చూడాలి. 2024లో సబలెంక (ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్) రెండు టైటిళ్లు నెగ్గగా, స్వైటెక్ (ఫ్రెంచ్ ఓపెన్), క్రెజికోవా (వింబుల్డన్) చెరో టోర్నీలో గెలుపొందారు. ఈ ఏడాది టెన్నిస్‌లో ఈ గ్రాండ్‌స్లామ్‌లతో పాటు డేవిస్ కప్, ఏటీపీ, డబ్యూటీఏ ఫైనల్స్ తదితర టోర్నీలు జరగనున్నాయి.
ఇంకెన్నో!
అయితే ప్రస్తుతం భారత మట్టి ఆటలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీంతో మొట్ట మొదటిగా ఖోఖోలో ప్రపంచకప్ నిర్వహించనున్నారు. దిల్లీ వేదికగా జనవరి 13 నుంచి 19 వరకు జరిగే ఈ ప్రపంచకప్ జరగనుంది.
ఇదిలా ఉండగా, ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన బాక్సింగ్ స్టార్ నిఖత్ జరీన్ ఈ కొత్త ఏడాదిలో జోరందుకోవాలని చూస్తోంది. మార్చిలో సెర్బియాలో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది.
మరోవైపు రెజ్లింగ్‌లో 2024లో భారత్‌కు పెద్దగా మంచి ఫలితాలు దక్కలేదు. ఈ క్రమంలో అన్షు మలిక్, అంతిమ్ ఫంగాల్, అమన్ సెహ్రావత్ వంటి రెజ్లర్లు 2025లో ఎలా ఆడతారో వేచి చూడాలి. ఇక ఫుట్‌బాల్ కిక్కు అందించేందుకు నేషన్స్ లీగ్, ఛాంపియన్స్ లీగ్, ఐరోపా లీగ్ ఎలాగో ఉన్నాయి. హాకీలో ఇండియా లీగ్, ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌తో పాటు డిసెంబర్‌లో పురుషుల జూనియర్ ప్రపంచకప్ జరగనున్నాయి.
వరల్డ్ ఛాంపియన్‌గా కోనేరు హంపి- తెలుగు గ్రాండ్ మాస్టర్ అరుదైన ఘనత!