Russia Military Nuclear Head Kirillov Died :రష్యాలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడులో ఆ దేశ ఆర్మీ న్యూక్లియర్ డిఫెన్స్ ఫోర్సెస్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్ మృతి చెందారు. రష్యాలో అణు, జీవ, రసాయన ఆయుధాల రక్షణ ఆయన అధీనంలోనే ఉంది. కిరిల్లోవ్ నివశించే అపార్టుమెంట్ బ్లాక్ సమీపంలో ఆపిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పేలుడు పదార్థాలు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. ఆ పేలుడులో ఇగోర్‌తో పాటు ఆయన అసిస్టెంట్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ఓ ప్రకటనలో పేర్కొంది.
భవనం ముందు శిథిలాలు పడి ఉండగా అక్కడే మంచులో రెండు మృతదేహాలు ఉన్నాయి. పేలుడు ఘటనపై దర్యాప్తు సాగుతోంది. ఇదిలా ఉండగా, కిరిల్లోవ్‌ను తామే చంపినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దీనివెనుక ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ SBU హస్తం ఉన్నట్లు తెలిపింది. ఘటనాస్థలంలో 300 కిలోల పేలుడు పదార్థాలను గుర్తించినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఈ పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లే మార్గం, రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో మొదలవుతుంది.
అందుకే చంపేశారా?
ఉక్రెయిన్‌కు చెందిన కీవ్ ఇండిపెండెంట్ పత్రిక ఇటీవలే ఇగోర్‌పై ఓ సంచలన కథనం ప్రచురించింది. నిషేధిత రసాయన ఆయుధాలను ఉక్రెయిన్‌పై ప్రయోగించేందుకు ఆయనే అనుమతి ఇచ్చినట్లు ఆరోపించింది. ఈ నేరానికిగాను ఉక్రెయిన్ కోర్టు కిరిల్లోవ్‌కు శిక్ష కూడా విధించింది. ఇది జరిగిన 24 గంటల్లోనే ఇగోర్‌పై బాంబు దాడి జరగడం గమనార్హం.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత ఇప్పటివరకు 4800 సార్లు రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపిస్తోంది. క్రూరమైన ఆయుధాలు ఉపయోగించినందుకుగాను కిరిల్లోవ్‌పై బ్రిటన్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఆంక్షలు విధించింది.
రష్యాలో ఉత్తర కొరియా సైనికులు మృతి!
ఉక్రెయిన్‌పై జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతోంది. ఈ క్రమంలో కుర్స్క్ సరిహద్దు గ్రామాల్లో మోహరించిన కిమ్ సైన్యంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జాడ లేకుండా పోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ వివరాలు వెల్లడించింది. దాదాపు 30 మంది చనిపోవడమో లేదా తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఉక్రెయిన్ సైనిక నిఘా సంస్థ పేర్కొంది.