Rahul Gandhi On Indian Politics :భారతదేశంలో నైపుణ్యం ఉన్న లక్షలాది మందిని విస్మరిస్తున్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు దేశంలో గౌరవం లేదని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్, టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో భారత్లో నిరుద్యోగంపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
"మీరు ఏకలవ్యుడు కథ వినే ఉంటారు. నైపుణ్యం ఉన్న ఏకలవ్యుడు గురుదక్షిణగా తన బొటనవేలిని సమర్పిస్తాడు. భారత్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే ఏకలవ్యుడి కథ మీకు తెలియాలి. దేశంలో రోజూ లక్షలాది మంది ఏకలవ్యులుగా మిగిలిపోతున్నారు. నైపుణ్యాలు ఉన్నాగానీ వారిని పక్కనబెట్టేస్తారు. వారిని ఉన్నత స్థాయికి వెళ్లనివ్వరు. దేశంలో ప్రతిచోట ఇలానే జరుగుతోంది. నైపుణ్యాల సమస్య ఉందని చాలా మంది అంటున్నారు. నేను అలాంటి సమస్య ఉందని అనుకోవట్లేదు. నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు భారత్లో గౌరవం లేదు. నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను గౌరవించి, వారికి మద్దతు ఇవ్వడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. దేశంలో 1-2 శాతం జనాభాకు మాత్రమే సాధికారత కల్పించడం ద్వారా భారతదేశ శక్తిని ఆవిష్కరించలేరు." అని రాహుల్ వ్యాఖ్యానించారు.
అందుకే నిరుద్యోగ సమస్య
భారత్, అమెరికాతో పాటు కొన్ని పశ్చిమ దేశాలను నిరుద్యోగ సమస్య వేధిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ చైనాలో మాత్రం ఆ ఇబ్బంది లేదని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి రంగంలో చైనా ఆధిపత్యం చెలాయించడమే అందుకు కారణమని పేర్కొన్నారు. భారత్ కూడా తయారీ రంగంపై దృష్టి పెట్టాలని సూచించారు.
'నైపుణ్యాలకు కొరతేమీ లేదు'
"భారతదేశంలో నైపుణ్యాలకు కొరత లేదు. ఉత్పత్తి రంగంపై మరింత దృష్టిసారిస్తే చైనాతో పోటీపడగలదు. పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలంటే దేశం తయారీ రంగంపై దృష్టి సారించాలి. సాంకేతికత వల్ల కొంతమందికి ఉపాదిని కల్పిస్తే, మరికొంతమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. టెక్నాలజీ వల్ల పూర్తిగా ఉద్యోగాలు పోతాయని నేను నమ్మను." అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
'బీజేపీ అంటే భయం పోయింది'
భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, వినయం వంటివి లేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారతదేశం ఒకే ఆలోచన అని ఆర్ఎస్ఎస్ నమ్ముతోందని విమర్శించారు. టెక్సాస్ లో ప్రవాస భారతతీయులనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
"భారతదేశం ఒకటే ఆలోచన అని ఆర్‌ఎస్‌ఎస్ విశ్వసిస్తోంది. భారత్ బహుళ ఆలోచనల సమాహరం అని మేము నమ్ముతున్నాం. యూఎస్ లాగే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని మేం కోరుకుంటాం. కులం, భాష, మతం, సంప్రదాయం, చరిత్రతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ అవకాశాలు ఇవ్వాలి. భారత ప్రధాని రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని దేశంలోని లక్షలాది మందికి స్పష్టంగా అర్థమైంది. అదే లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది నిమిషాల్లోనే దేశంలో ఎవరూ బీజేపీ, ప్రధానమంత్రికి భయపడలేదని మేము గుర్తించాం.ఇక అమెరికా, భారత్ కు మధ్య ప్రవాస భారతీయులు వంతెనగా నిలిచారు. ప్రవాస భారతీయులు దేశ ఆలోచనలను అమెరికాకు, యూఎస్ ఆలోచనలకు భారత్కు తీసుకురావాలి."
-రాహుల్ గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత
'మీ నాన్నమ్మను అడగండి'
కాగా, అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్, దేశంలో నిరుద్యోగంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఏదైనా టెక్నాలజీ ద్వారా వెళ్లి రాహుల్ తన నానమ్మను(ఇందిరాగాంధీని ఉద్దేశించి) అడిగితే ఆర్ఎస్ఎస్ గురించి చెబుతారని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఎద్దేవా చేశారు. చరిత్ర పుటల్లో ఆర్ఎస్ఎస్ గురించి చూడండని అన్నారు. రాహుల్ గాంధీ ఈ జన్మలో ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోలేరని విమర్శించారు.
'రాహుల్ చైనాను ప్రేమిస్తున్నారు'
రాహుల్ గాంధీకి వాస్తవాలు తెలియవని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్ వాల్ విమర్శించారు. నిరుద్యోగం విషయంలో చైనాను పొడుగుతూ, డ్రాగన్ను తాను ఎంత ప్రేమిస్తున్నానో రాహుల్ మరోసారి దేశానికి చాటిచెప్పారని ఎద్దేవా చేశారు. "ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందంటే దానికి కారణం కాంగ్రెస్ పాలనే. గత పదేళ్లలో ప్రధాని మోదీ దేశంలో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించారు. అలాగే అనేక పథకాలను అమలు చేశారు. ప్రతిపక్ష నేత(రాహుల్) ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తే ప్రజలకు తప్పకుండా సమాధానం చెబుతారు." అని ప్రవీణ్ ఖండేల్ వాల్ వ్యాఖ్యానించారు.