Putin China Visit : రష్యా, చైనాల మధ్య అవకాశావాద సంబంధాలు లేవని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి సుస్థిరత కలిగించే అంశంగా మారాయని, ఇతర దేశాలకు చక్కటి ఉదాహరణగా నిలిచాయని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంయుక్త ప్రకటన చేశారు. చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, దౌత్య, వాణిజ్య, భద్రతా సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుదేశాల అధినేతలు జిన్‌పింగ్, పుతిన్ చర్చించుకున్నారు. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
పుతిన్‌కు ఘన స్వాగతం
రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా వచ్చిన పుతిన్‌కు గురువారం ఘనస్వాగతం లభించింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధ పరిస్థితి, పశ్చిమ దేశాలతో రష్యా ఘర్షణలపై పుతిన్, జిన్‌పింగ్‌ల మధ్య చర్చలు జరిగాయి. "మేం విశ్వసించే మంచి స్నేహితుడు మా దేశ భాగస్వామిగా ఉండటానికి చైనా వస్తున్నారు. చైనా, రష్యా దేశ ప్రజల మధ్య శాశ్వత స్నేహాన్ని బలపరచడానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి రష్యాతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది" అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు.
చైనా, రష్యా మధ్య బంధం బలంగా ఉందని పుతిన్ అన్నారు. వివిధ రంగాల్లో ఇరుదేశాలు సహకరించుకుంటాయని తెలిపారు. రష్యా, చైనా మధ్య అవకాశవాద సంబంధాలు లేవని వెల్లడించారు. ఈ సంబంధాలు ఎవరికీ వ్యతిరేకంగా ఉండవని చెప్పారు. మరోవైపు, ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్నవేళ చైనా శాంతి ప్రణాళికకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతు తెలిపారు. ఇది దేశాల మధ్య శత్రుత్వాన్ని అంతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.