PM Modi Meet Trump Highlights :రెండు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశానికి బయలుదేరారు. ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ప్రతినిధులు ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. ఈ పర్యటనలో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడేలా రెండు దేశాల నేతలు వాణిజ్యం, రక్షణ, సాంకేతికత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. కీలక ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
భారత్‌కు ఎఫ్-35 యుద్ధ విమానాలు
అమెరికా-భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 'తర్వలోనే ఓ భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి భారత్‌కు మిలిటరీ ఉత్పత్తులు విక్రయాలను పెంచుతాం. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం' అని ట్రంప్ వెల్లడించారు.
ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందం తర్వలోనే జరుగుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. అమెరికాలో చమురు, గ్యాస్ వాణిజ్యంపైనా దృష్టిపెడతాం. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యమని తెలిపారు.
అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తాం : మోదీ
భేటీ సందర్భంగా వలసదారుల అంశంపైనా ఇరు దేశాధినేతలు చర్చించారు. చట్టవిరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని, ఈ విధానం ప్రపంచమంతటికీ వర్తిస్తుందని తెలిపారు. 'యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారు. డబ్బు, ఉద్యోగాల ఆశజూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు. అలా వారికి తెలియకుండానే మానవ అక్రమరవాణా కూపంలోకి వెళ్తున్నారు. ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాల్లో భారత్‌కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం' అని మోదీ వెల్లడించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తలపైనా మోదీ మాట్లాడారు. యుద్ధం విషయంలో భారత్‌ది తటస్థ వైఖరి కాదని, మేం శాంతి వైపు నిలబడుతామని తెలిపారు. ఇది యుద్ధాల శకం కాదని ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. ఉద్రిక్తతలను ఆపడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు మద్దతిస్తున్నామని మోదీ వెల్లడించారు.
'తహవూర్ రాణాను భారత్‌కు అప్పగిస్తాం'
26/11 ముంబయి ఉగ్రదాడిలో ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు, త్వరలోనే మరింత మందికి ఇదే బాట తప్పదంటూ ఖలిస్థానీ ఉగ్రవాది గురపత్వంత్ సింగ్ పన్నూను ఉద్దేశిస్తూ ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. ఈ ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
మనం కలిస్తే మెగా భాగస్వామ్యమే
ట్రంప్ ఎన్నికల ప్రచారం సమయంలో 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' (MAGA) అనే నినాదాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు. దీన్నుంచి స్ఫూర్తి పొందుతూ తాను కూడా 'మేక్ ఇండియా గ్రేట్ అగైన్' (MIGA) నినాదం ఇస్తున్నట్లు మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. MAGA, MIGA కలిస్తే 'మెగా' భాగస్వామ్యం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.