PM Modi Kuwait Visit :కువైట్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ద గ్రేట్' అందుకున్నారు. కువైట్ రాజు షేక్ మేషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఈ అవార్డు అందజేశారు. అనంతరం రెండు దేశాల మధ్య సంబధాలు బలోపేతం చేసేలా ఇరువురు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంతోపాటు ఫార్మా, ఐటీ, ఫిన్‌టెక్, సెక్యూరిటీ. ఇంధనరం వంటి కీలక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ' ఇది అద్భుతమైన భేటీ. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాం. ఇరుదేశాల మధ్య సాధారణ భాగస్వామ్యాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాం.' అని మోదీ వెల్లడించారు.
ఆ తర్వాత కువైట్ యువరాజు షేక్ సబా అల్-ఖలీద్ అల్-సబాతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం సహా కీలకరంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్‌కు చెందిన అగ్రశ్రేణి వ్యాపార భాగస్వాముల్లో కువైట్ ఒకటి కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరోలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాలర్లకు చేరింది.
అంతకుముందు ప్రధాని మోదీ కువైట్ రాజప్రసాదం వద్ద అధికారిక స్వాగతంతోపాటు గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ మొదటిరోజు ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. అనంతరం భారతీయ కార్మికుల శిబిరాన్ని సందర్శించి, వారితో కొంచెం సేపు ముచ్చటించారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
ప్రధాని మోదీకి లభించిన 20వ అంతర్జాతీయ పురస్కారం ఇది. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఈ పురస్కారం అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ తదితరులు దీన్ని అందుకున్నారు.