PM Modi Putin Talks : రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి స్వస్థిపలికి శాంతి చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బాంబుదాడులు, తుపాకీ కాల్పుల మధ్య శాంతి చర్చలు సఫలం కాబోవని తేల్చిచెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని పుతిన్‌తోపాటు యావత్ ప్రపంచానికి తేల్చిచెప్పారు. ఇదే సమయంలో భారత్, రష్యా ద్వైపాక్షిక బంధం సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
'ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు జరపండి!'
కొత్త తరం భవిష్యత్తు కోసం శాంతి చాలా అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు సఫలం కావని పేర్కొన్నారు. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. గత ఐదేళ్లలో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని అందులో మొదటిది కొవిడ్ మహమ్మారి కాగా, రెండోది పలు దేశాల మధ్య ఘర్షణలని పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్-రష్యా బంధం మరింత దృఢం!
రానున్న కాలంలో భారత్- రష్యాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. ఇంధన రంగంలో భారత్-రష్యా సహకారం ప్రపంచానికి కూడా సాయపడిందని పేర్కొన్నారు. భారత్ సుమారు 40 ఏళ్లుగా తీవ్రవాద సవాలును ఎదుర్కొంటోందని, తాను ఉగ్రవాద చర్యలను ఖండిస్తున్నానని అన్నారు.
"కొన్నాళ్ల క్రితం ప్రపంచం ఆహారం, ఇంధనం, ఎరువుల కొరతను ఎదుర్కొంది. భారతదేశ రైతులు ఆ సమస్యను ఎదుర్కొలేదు. అందుకు రష్యా కూడా ఒక కారణం. దేశ రైతుల సంక్షేమం కోసం రష్యాతో సంబంధాలను మరింత విస్తరించాలనుకుంటున్నాం. రష్యా సహకారం కారణంగా భారత పౌరులు ఇంధన కొరతను ఎదుర్కోకుండా కాపాడగలిగాం. జులై 8న (సోమవారం) పుతిన్‌తో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. శాంతి పునరుద్ధరణ కోసం భారత్ అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉంది" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.