PM Modi Poland Visit :యుద్ధ భూమిలో సమస్యకు పరిష్కారాలు లభించవనే విషయాన్ని భారత్ బలంగా విశ్వసిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తూ, ఆ ప్రాంతంలో శాంతి, సుస్థిరత పునరుద్ధరణకు అన్ని విధాలా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ కంటే ముందు పోలండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ తర్వాత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
యావత్ మానవాళికే పెద్ద సవాల్
'ఉక్రెయిన్, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాలు మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించేవి. యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఏ సంక్షోభంలోనైనా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోవడం యావత్ మానవాళికే అతి పెద్ద సవాల్‌గా మారింది. సాధ్యమైనంత త్వరగా శాంతి, సుస్థిరత నెలకొనడానికి మేము దౌత్యాన్ని, చర్చలను సమర్థిస్తాం. అందుకోసం భారత్ తన మిత్రదేశాలతో కలిసి అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉంది' అని ప్రధాని మోదీ అన్నారు.
'ఆ సమయంలో భారత్ విద్యార్థలకు సాయం చేశారు'
విదేశీ పర్యటనలో భాగంగా పోలండ్ వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధాన్ని ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చించామని, తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సమయంలో ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత్, పోలండ్ భావిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. భేటీలో భాగంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని పెంపొందించే విషయాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సామాజిక భద్రతా ఒప్పందానికి మేము అంగీకరించడం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు.
'ఈ పర్యటన ప్రత్యేకమైనది'
రెండు దేశాల భాగస్వామ్యంలో ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనదని పోలండ్ ప్రధాని టస్క్ అన్నారు. 45ఏళ్ల అనంతరం భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషంగా ఉందని, ఈ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుంది అని అన్నారు. ఇక రెండు రోజుల పోలండ్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. పోలండ్ నుంచి రైలులో బయలుదేరి 10 గంటల ప్రయాణం అనంతరం మోదీ ఉక్రెయిన్‌కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అవుతారు.
పోలెండ్‌కు ప్రధాని మోదీ- 45 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్! - PM Modi Poland Visit