PM Modi Meets US Prez : క్వాడ్ సదస్సు నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. బైడెన్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించినట్టు మోదీ తెలిపారు. చర్చలు ఫలప్రదమైనట్టు భేటీ అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. డెలావేర్‌లోని గ్రీన్‌విల్లేలోని బైడెన్ నివాసంలో తనకు ఆతిథ్యమిచ్చినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. భారత్‌తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైంది, సన్నిహితమైంది, చైతన్యవంతమైందని బైడెన్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ, తాను చర్చలకు కూర్చున్న ప్రతిసారీ కొత్త సహకార రంగాలను కనుగొనగల ఇరు దేశాల సామర్థ్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోతున్నట్టు ఎక్స్‌లో రాసుకొచ్చారు. సమావేశానికి ముందు మోదీని బైడెన్ ఆలింగనం చేసుకున్నారు. మోదీని ఆత్మీయంగా చేతులు పట్టుకుని తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి చర్చలు జరిపారు.
ఘన స్వాగతం
అమెరికా పర్యటనలో భాగంగా తొలుత ఫిలాడెల్ఫియా విమానాశ్రయంలో దిగిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం దక్కింది. విమానాశ్రయం వెలుపల ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సంభాషించారు. తరువాత డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లోని హోటల్ డుపాంట్‌లోనూ ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడారు. అక్కడ ప్రదర్శించిన 'గర్బా'ను ప్రధాని వీక్షించారు. ఇవాళ న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేస్తున్న 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు.
స్నేహబంధం
క్వాడ్ సదస్సు కోసం అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ విడివిడిగా జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులతో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్ రీజియన్ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్లతో భేటీ అయిన ప్రధాని మోదీ విస్తృతమైన చర్చలు జరిపారు. 'వాణిజ్యం, భద్రత, అంతరిక్ష రంగం (స్పేస్), సంస్కృతి (కల్చర్) వంటి రంగాల్లో మరింత సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాం. కాలపరీక్షకు తట్టుకుని నిలబడిన ఆస్ట్రేలియా స్నేహాన్ని భారతదేశం ఎంతో గౌరవిస్తుంది' అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు మోదీతో భేటీ తరువాత భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ అన్నారు.
ప్రపంచ శ్రేయస్సు కోసం
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, సహా మరిన్ని రంగాల్లో పరస్పర సహకారం గురించి కిషిదతో మోదీ చర్చించారు. భారత్-జపాన్ల సంబంధాలు ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పడతాయని' ఆయన అన్నారు.
క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదు!
క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టుముట్టిన సమయంలో విల్మింగ్‌టన్‌లో ఈ సమావేశం జరుగుతోందని ఆయన చెప్పారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగా క్వాడ్‌తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. 2021లో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును ప్రధాని గుర్తు చేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని పేర్కొన్నారు. 2025లో క్వాడ్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం ఎంతో సంతోషకరంగా ఉందని మోదీ చెప్పారు.
అమెరికాలో 14వేల మందితో మోదీ ఈవెంట్- 31ఏళ్ల క్రితం రెండే రెండు డ్రెస్సులతో యూఎస్ టూర్! - MODI AMERICA TOUR