PM Modi Austria Visit :ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని, యుద్ధాన్ని కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఎప్పుడూ సర్వమానవాళి శాంతి, సామరస్యాలే కోరుకుందని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత సమర్థంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి భారతీయులను ఉద్దేశించి ఈ మేరకు ప్రసంగించారు.
విశ్వబంధుగా భారత్
ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆసక్తిగా చూస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. 'భారత్ చేసే ఆలోచనలు, పనులను ప్రపంచం మొత్తం నిశితంగా గమనిస్తున్నాయి. వేల సంవత్సరాలుగా భారత్ తమ నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటోంది. తద్వారా యుద్ధానికి బదులుగా శాంతి, సామరస్యాన్ని ప్రచారం చేస్తోంది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను విశ్వబంధుగా చూస్తోంది. అది మనందరికీ గర్వకారణం. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. తర్వాత వెయ్యేళ్ల పాటు అభివృద్ధి చెందిన, బలమైన దేశంగా కొనసాగేలా ప్రణాళికలు రచిస్తున్నా' అని భారత్‌పై తన భవిష్యత్ ప్రణాళికల గురించి ప్రధాని మోదీ ప్రవాసులకు వివరించారు.
'అన్ని రంగాల్లో సహకారం ఉంటుంది'
భారత్ తరహాలోనే ఆస్ట్రియా చరిత్ర, సంస్కృతి చాలా పురాతమైనది, గొప్పదని ప్రధాని మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య బంధాలూ చరిత్రాత్మకమైనవని గుర్తు చేశారు. దీని వల్ల ఉభయ దేశాలూ లబ్ధి పొందాయని తెలిపారు. సంస్కృతి, వాణిజ్యం ఇలా అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతోందని పేర్కొన్నారు. మోదీ ప్రసంగిస్తున్నంతసేపూ అక్కడి ప్రవాసులు 'భారత్ మాతా కీ జై', 'వందేమాతరం' అనే నినాదాలతో సభను హోరెత్తించారు.