US Aircraft Helicopter Collision : అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీపంలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ విమానం, మిలిటరీ హెలికాప్టర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో అనేక మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. కానీ మృతుల సంఖ్యపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు.
కాన్సాస్‌లోని విచిటా నుంచి బయలుదేరిన పీఎస్ఏ ఏయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్ CJR700 విమానం, ల్యాండింగ్ అవుతుండగా సికోర్స్కీ H-60 హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న పొటోమాక్ నదిలో పడిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు-ఎన్టీఎస్ నేతృత్వంలో ఎఫ్ఏఏ దర్యాప్తు చేస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. నదిలో విమానం కూలిపోగా, ఫైర్ బోట్లు రంగంలో దిగి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించినదిగా పేర్కొన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వారు క్షేమంగా ఉండాలి : ట్రంప్
ఈ ఘోర ప్రమాదం గురించి తనకు సమాచారం అందిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్వరగా స్పందించినందుకు ఫస్ట్ రెస్పాండర్స్‌కు అభినందనలు తెలిపారు. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. విమానంలో ఉన్న వారు క్షేమంగా (మె గాడ్ బ్లెస్ దేర్ సోల్స్) ఉండాలని కోరుకున్నారు.
ఈ ఘటనపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ప్రమాదానికి గురైన విమానంలో ఉన్నవారి గురించి ప్రార్థన చేయాలని కోరారు. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నాము తెలిపారు. కానీ ప్రస్తుతానికి మనం మంచి జరగాలని ఆశిద్దామని అన్నారు.
అందుబాటులో ఉన్న అన్ని కోస్ట్ గార్డ్ వనరులను మోహరిస్తున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ చెప్పారు.