Palestine New Prime Minister :పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధానిగా మొహమ్మద్ ముస్తఫా నియమితులయ్యారు. తన వద్ద సుదీర్ఘ కాలంగా సలహాదారుగా ఉన్న ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలని అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన ఈ నియామకాన్ని చేపట్టారు. ఆర్థికవేత్త అయిన ముస్తఫా అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు.
అమెరికా ఒత్తిళ్లతోనే నియామకం
ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం ప్రధానిగా ఉన్న మొహమ్మద్ ఫిబ్రవరిలో తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు యుద్ధానంతరం గాజాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని అమెరికా ఎప్పటినుంచో అంచనా వేస్తోంది. దీంతో అమెరికా ఒత్తిళ్లతోనే అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ఇక ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు సమాచారం. 2014లో గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత పునర్నిర్మాణ పనుల్లో ముస్తఫా భాగమయ్యారు. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది.