Pakistan Road Accident :పాకిస్థాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిన ఘటనలో మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం కరాచీలోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పలువురు ముస్లిం యాత్రికుల బృందంతో ఓ బస్సు తట్ట ప్రాంతం నుంచి బయలుదేరింది. వీరంతా రంజాన్ పండుగను పురస్కరించుకొని బలూచిస్థాన్ ప్రావిన్స్ ఖుజ్దార్ జిల్లాలోని ఉన్న మారుమూల సూఫీ పుణ్యక్షేత్రమైన షా నూరానీ దర్శనం కోసం వెళ్తున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వీరి బస్సు సింధ్-బలూచిస్థాన్ ప్రావిన్సుల సరిహద్దు పట్టణ సమీపంలోకి చేరుకుంది. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
'ఒకే కుటుంబాలకు చెందినవారు'
ఈ ప్రమాద దుర్ఘటనపై పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మోహ్సిన్ నఖ్వీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 'సూఫీ పుణ్యక్షేత్రం సందర్శనం కోసం వెళ్తున్న ఓ భక్తుల బృందం బస్సు బుధవారం రాత్రి హబ్ పట్టణంలో ప్రమాదానికి గురైంది. వీరి బస్సు అదుపుతప్పి ప్రమాదవశాత్తు ఓ లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం కరాచీకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సింధ్ ప్రావిన్స్‌లోని థాట్టా పట్టణానికి చెందినవారిగా గుర్తించాం. వీరిలో కొందరు ఒకే కుటుంబానికి చెందినవారని తెలిసింది' అని నఖ్వీ చెప్పారు. మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణను కోల్పోవడం వల్లే బస్సు అదుపుతప్పి లోయలో పడి ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అన్నారు.