Pakistan New Government : దాయాది దేశం పాకిస్థాన్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (PML-N) పార్టీ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) జరుపుతున్న చర్చల్లో పురోగతి సాధించింది.
పీపీపీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో తమ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ఆదివారం జరిపిన చర్చల్లో చాలా అంశాలపై సఖ్యత కుదిరినట్లు పీఎంఎల్-ఎన్ ప్రకటించింది. రాజకీయ అనిశ్చితి నుంచి దేశాన్ని రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని పేర్కొంది. త్వరలో జరగబోయే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పీపీపీ నాయకత్వం వారి ప్రతిపాదనలను తమ ముందు ఉంచుతుందని తెలిపింది.
యావత్ పాకిస్థాన్ పరిస్థితిని సమీక్షించి, ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది పీఎంఎల్-ఎన్ పార్టీ. భవిష్యత్‌లో రాజకీయ సహకారంపైన కూడా పూర్తి వివరంగా చర్చించినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ పక్షానే నిలిచారని మరోసారి ప్రకటించింది. పీఎంఎల్-ఎన్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పీపీపీ కూడా ధ్రువీకరించింది.