Monkeypox Cases Today : ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ వైరస్ సోకిన రోగుల సంఖ్య 18,737కు చేరింది. ఒక్క వారంలోనే 1200 కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లేడ్ 1 వేరియంట్‌తోపాటు అన్ని రకాల వైరస్‌లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 541 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 96శాతం కేసులు, మరణాలు కాంగోలోనే నమోదవుతుండగా ఈ ఒక్క వారంలో 222 కేసులు నిర్ధరణ కాగా 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా మరణాలరేటు 2.89శాతంగా ఉంది.
టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలని!
Monkeypox Cases Africa :కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వారంలో 39 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్థాన్, స్వీడన్‌లో మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. మంకీపాక్స్ వైరస్ విజృంభణ వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇప్పటికే అంతర్జాతీయ ఆందోళనతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలో ఆ కమిటీ తొలి దశ సిఫార్సుల్ని ప్రచురిస్తామని WHO తెలిపింది. NGOలతో కలిసి టీకా ఉత్పత్తిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది.
వ్యాపారుల ఆందోళన
జింబాబ్వేలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్‌మెంట్ సొసైటీ దేశాలు కోరలు చాస్తున్న ఎంపాక్స్ వైరస్‌పై చర్చించారు. WHOతో పాటు పలు దేశాల వ్యాధి నియంత్రణ సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములు మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రభావిత దేశాలకు సంఘీభావం, మద్దతును ప్రకటించారు. మంకీపాక్స్ అంటువ్యాధి ప్రబలుతున్న సమయంలో ఆఫ్రికాతో ఎగుమతి, దిగుమతులు జరిపే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు విషమించకున్నా వ్యాధి వ్యాప్తి గురించి భయపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు వాణిజ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
దిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం
Monkeypox Cases In India :భారత్‌లో ప్రస్తుతానికి ఎంపాక్స్ కేసులు వెలుగుచూడలేదు. అయినప్పటికీ WHO సూచనల దృష్ట్యా వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, గ్రౌండ్ క్రాసింగ్‌లలోని ఆరోగ్య విభాగాలను అప్రమత్తం చేసింది. మరోవైపు, ఎంపాక్స్ వ్యాప్తి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల సంసిద్ధతపై పీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యం, హోం, విపత్తు నిర్వహణ, ఆరోగ్య పరిశోధనల కార్యదర్శులతోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
మంకీపాక్స్ అంటే ఏంటి?
What Is Monkeypox :ఎంపాక్స్ ఒక వైరల్ వ్యాధి. ఇది వ్యాధి సోకిన జంతువుల లేదా మనుషుల నుంచి వ్యాప్తి చెందుతుంది. రోగితో లైంగిక లేదా సన్నిహితంగా మెలిగినా వైరస్ వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, చర్మంపై పొక్కులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గతంలో వ్యాపించిన వైరస్ నోరు, ముఖం, చేతులు, కాళ్లపై ప్రభావం చూపిస్తే ప్రస్తుతం ఎక్కువగా జననేంద్రియాల వద్ద ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రోగుల గుర్తింపు కష్టమై వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. 1970లో కాంగోలో తొలిసారి ఇది మనిషికి సోకినట్లు గుర్తించారు. ప్రాణాంతకమైన క్లాడ్ 1 వేరియంట్ ఎక్కువగా కాంగో బేసిన్‌లోనే ఎక్కువగా ఉంది.