తెలంగాణ

telangana

ETV Bharat / international

పుతిన్‌కు కిమ్‌ న్యూ ఇయర్ గ్రీటింగ్స్​ - యుద్ధంలో విజయం సాధించాలని ఆకాంక్ష! - KIM LETTER TO PUTIN

'ప్రియమైన మిత్రునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు' - పుతిన్​కు కిమ్​ గ్రీటింగ్స్​

Kim and Putin
Kim and Putin (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 10:40 AM IST

Kim Letter To Putin : ఉత్తరకొరియా-రష్యా మధ్య స్నేహం రోజురోజుకీ మరింతగా బలపడుతోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​కు లేఖ రాశారు. అందులో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారని స్థానిక మీడియా పేర్కొంది.

రష్యా విజయం సాధించాలని ఆకాంక్ష
కిమ్ జోంగ్ ఉన్​ - పుతిన్‌తో పాటు రష్యాన్‌ ప్రజలకు, అలాగే ఆ దేశ బలగాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రష్యాతో తమ దేశ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తామని అన్నారు. అంతేకాదు 2025లో నియో నాజీయిజాన్ని ఓడించి రష్యా సైన్యం, ప్రజలు విజయాన్ని దక్కించుకోవాలని కిమ్ ఆకాంక్షించారు.

బలపడుతున్న స్నేహబంధం
ఈ ఏడాది మాస్కోలో కిమ్‌, ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించిన సంగతి తెలిసిందే. 24 ఏళ్లలో తొలిసారిగా ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. శత్రుదేశం దాడి చేస్తే ఈ రెండూ ఒకదానికొకటి సహకరించుకునేలా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో మాస్కోకు కిమ్ అండగా నిలిచారు. 10వేల మంది సైనికులకు రష్యాకు సాయంగా పంపించారు. వారు రష్యా తరఫున యుద్ధంలో పోరాడుతున్నారు. మాస్కోలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి కదన రంగంలోకి దింపినప్పటికీ, భాష సమస్య కారణంగా కొరియన్ సేనలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉక్రెయిన్‌ బలగాల చేతుల్లో హతమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు రష్యా- ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం పాశ్చాత్య దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

కూతురితో కలిసి
కొత్త ఏడాదికి ముందు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ - తమ దేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందుకోసం కల్మా జిల్లా వోన్సన్‌లో ఉన్న ఓ టూరిస్ట్ రిసార్ట్‌ను కుమార్తెతో కలిసి ఆయన సందర్శించారు. అక్కడున్న సౌకర్యాలను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న కట్టడాల పనులపై అధికారులను ఆరా తీశారు. సమీపంలోని ఓ బీచ్‌లో కాసేపు నడిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా విడుదల చేసింది. కల్మాలోని టూరిస్ట్ రిసార్ట్ 2025లో పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గతంలో పర్యాటకం ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి ఉత్తర కొరియా యత్నించింది. 2020లో కొవిడ్ తర్వాత పర్యాటకులను అనుమతించట్లేదు. రష్యాకు చెందిన కొందరు అధికారులకు మాత్రమే అనుమతిచ్చింది. ఈ ఏడాది మళ్లీ పర్యాటకులను అనుమతిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details