Nobel Economics Prize 2024 :వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధనలు చేసిన ముగ్గురికి ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది. డారన్ ఏస్మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్కు అవార్డు ఇస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. వీరు చేసిన పరిశోధనలు దేశాలు సమృద్ధి చెందడం వెనుక సాంఘిక వ్యవస్థల పాత్రను అర్థం చేసుకునేందుకు, వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలు తెలుసుకునేందుకు ఉపకరించాయని పేర్కొంది.
'కొన్ని దేశాలు మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందుతాయి?'- పరిశోధన చేసిన వారికి నోబెల్ - NOBEL ECONOMICS PRIZE 2024
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటన- డారన్ ఏస్మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్కు అవార్డు
Published : Oct 14, 2024, 3:33 PM IST
|Updated : Oct 14, 2024, 3:58 PM IST
'ప్రజలను దోచుకునే వ్యవస్థలు ఉన్న దేశాలు అభివృద్ధి కావు'
"దేశాల మధ్య ఆదాయ వ్యత్యాసాలను తగ్గించడం మన ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో సాంఘిక వ్యవస్థలు ఎంత ముఖ్యమో ఈ పరిశోధకులు మనకు తెలియచెప్పారు. చట్టాలను సరిగా పాటించని సమాజాలు, ప్రజలను దోచుకునే వ్యవస్థలు ఉన్న దేశాలు అభివృద్ధి కావు, సరైన దిశలో మార్పు చెందవు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు వీరి పరిశోధన మనకు ఉపకరిస్తుంది" అని నోబెల్ కమిటీ తెలిపింది.
ఆయన గుర్తుగా అర్థశాస్త్ర నోబెల్
నోబెల్ పురస్కార విజేతలైన ఏస్మొగ్లు, జాన్సన్- మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో రాబిన్సన్ పరిశోధనలు చేస్తున్నారు. అర్థ శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని సాంకేతికంగా నోబెల్ ప్రైజ్‌గా పరిగణించరు. డైనమైట్ను కనిపెట్టిన 19వ శతాబ్దపు స్వీడిష్ వ్యాపారి, రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ ఐదు రంగాల్లో (వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి) నోబెల్ పురస్కారాన్ని ఇవ్వడం మాత్రమే ప్రారంభించారు. అయితే, ఆయన గుర్తుగా బ్యాంగ్ ఆఫ్ స్వీడన్ 1968 నుంచి ఆర్థిక శాస్త్రంలో పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించింది. అధికారికంగా దీనిని బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ అంటారు. కానీ, మిగిలిన ఐదు పురస్కారాలతోపాటే ఆర్థిక శాస్త్రం అవార్డును కూడా నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న విజేతలకు ప్రదానం చేస్తారు.