India US Tariffs Trump :టారిఫ్‌ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని అన్నారు. ఇకపై తాము కూడా అదే రీతిలో వ్యవహరిస్తామని FOX న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తేల్చిచెప్పారు.
ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అందులో టారిఫ్‌ల గురించి ఆసక్తికర చర్చ జరిగినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. భారత్, అమెరికా పరస్పరం పన్నులు విధించుకోబోతున్నట్లు మోదీకి చెప్పానని వివరించారు. భారత్ ఎంత శాతం పన్ను విధిస్తే తానూ అంతే విధిస్తానని స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. ఇంతలో మోదీ ఏదో చెప్పబోయినప్పటికీ, దానిని తాను ఇష్టపడనని స్పష్టంగా చెప్పినట్లు వివరించారు. భారత్ ఎంత ఛార్జ్ చేస్తే అమెరికా కూడా అంతే విధిస్తుందని స్పష్టంగా చెప్పానని వెల్లడించారు.
దిగుమతులపై భారత్ 100 శాతం పన్ను: మస్క్
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటిపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఉంది. ముఖ్యంగా ఆటో మొబైల్ రంగంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కార్లపై దాదాపు 100 శాతం సుంకాలను భారత్ విధిస్తోంది. FOX న్యూస్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ట్రంప్ పక్కనే కూర్చున్న మస్క్ చెప్పారు. ఆటో దిగుమతులపై భారత్ 100 శాతం పన్ను విధిస్తోందంటూ ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించారు.