Nitrogen Gas Execution Alabama :ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి ఓ దోషికి మరణశిక్షను అమలు చేయబోతున్నారు. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో భార్యను హత్య చేసి దశాబ్దాలుగా జైలు జీవితం గడుపుతున్న యూజీన్ స్మిత్ అనే 58 ఏళ్ల ఖైదీకి ఈ శిక్షను అమలు చేయబోతున్నారు. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో ఈ శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.( Nitrogen Gas Execution Method ) ఈ పద్ధతిలో నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే ఆక్సిజన్ అందక ఖైదీ అపస్మారక స్థితిలోకి జారుకుని ఆ తర్వాత మరణిస్తాడు. నైట్రోజన్ మోతాదు అధికంగా ఉండడంతో ఆక్సిజన్ అందక దోషి బాధను అనుభవిస్తూ మరణిస్తాడు. మనిషికి శ్వాస అందనప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాల్ని హరిస్తారు.
Nitrogen Gas Execution US :1988లో ఓ మత బోధకుని భార్యను సుపారీ తీసుకుని చంపిన కేసులో యూజీన్ స్మిత్ దోషిగా తేలాడు. తన భార్య ఎలిజబెత్‌ను చంపేదుకు చార్లెస్ సెన్నెట్ అనే వ్యక్తి విలియమ్స్‌కు వెయ్యి డాలర్ల సుపారీ ఇచ్చాడు. ఈ పని పూర్తి చేసేందుకు విలియమ్స్- స్మిత్, పార్కర్‌లను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి చార్లెస్ భార్యను అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం పోలీసులకు దొరికిపోతామనే భయంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం కోర్టు విచారణలో బిల్లీ గ్రే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్షపడగా- 2020లో జైల్లోనే అనారోగ్యంతో మరణించాడు. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష పడింది. 2010 జూన్‌లో పార్కర్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణి శిక్ష అమలు చేశారు. స్మిత్‌కు కూడా 2022లో ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధించాలని ప్రయత్నించినా అది విఫలమైంది. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడం వల్ల ఆ శిక్ష నిలిపేశారు. ఈలోపు అలబామా కోర్చు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. ఇప్పుడు నైట్రోజన్ గ్యాస్ ద్వారా స్మిత్‌కు మరణ శిక్ష అమలు చేయనున్నారు.