Nikki Haley Drop Out US Presidential Race :అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ అధికారికంగా ప్రకటించారు. బుధవారం దేశవ్యాప్తంగా జరిగిన అభ్యర్థిత్వ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. "నా క్యాంపెయిన్‌ను నిలిపివేయాల్సిన సమయం వచ్చింది. అమెరికన్లు తమ గళాన్ని వినిపించాలని కోరుకుంటున్నానని చెప్పేదాన్ని. నేను ఆ పని చేశా. నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఇకపై అభ్యర్థిని కానప్పటికీ, నమ్మిన అంశాలపై మాత్రం గళాన్ని వినిపించడం ఆపను" అని చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు అభినందనలు తెలిపిన హేలీ, అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. ఫలితంగా రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే మిగిలారు.
సూపర్‌ట్యూస్‌డే పేరిట మంగళవారం అమెరికాలోని 15 రాష్ట్రాల్లో, ఒక టెరిటరీలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఘన విజయం సాధించారు. ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన ట్రంప్, నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఒక్క వెర్మొంట్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో గెలుపొందారు. వెర్మొంట్‌లో ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీ విజయం సాధించారు. ఈ ఫలితాల నేపథ్యంలో ఆమె పోటీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.
మరోవైపు డెమోక్రాటిక్ పార్టీలో జో బైడెన్ మంగళవారం జరిగిన దాదాపు అన్ని ప్రైమరీల్లో గెలుపొందినట్లు CNN వెల్లడించింది. ఒక్క సమోవా టెరిటరీలో మాత్రం జేసన్‌పామర్ చేతిలో ఆయన ఓడిపోయారు. లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్ పొందడానికి ట్రంప్ ఈ నెల 12 వరకు, బైడెన్ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. సూపర్ ట్యూస్‌డే వరకు హేలీ ఖాతాలో 86 మంది, ట్రంప్ ఖాతాలో 956 మంది ఉన్నారు. అటు డెమొక్రటిక్ పార్టీలో 1,968 ప్రతినిధుల మద్దతు అవసరం కాగా, 994 మంది బైడెన్‌కు అనుకూలంగా ఉన్నారు.