Israel Gaza Ceasefire Deal :అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య సయోధ్య కుదిరింది. బందీలను విడుదల చేయడానికి ఇరువర్గాల మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈమేరకు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డుగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లు పేర్కొంది.
అలాగే కేబినెట్ సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని ఆమోదించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సమావేశమవుతుంది. కేబినెట్ ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తే ఆదివారం నుంచి ఇది అమలుకావొచ్చని తెలుస్తోంది. బందీల విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించేందుకు నిబంధనలు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఒప్పందం విషయమై ఇప్పటికే బందీల కుటుంబాలకు సమాచారం ఇచ్చినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
అయితే ఒప్పందంలో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు హమాస్‌పైనా ఆయన ఆరోపణలు చేశారు. మరిన్ని రాయితీలు పొందేందుకు ఒప్పందంలోని కొన్ని అంశాల నుంచి హమాస్ వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు. అవి ఏ అంశాలో నెతన్యాహు స్పష్టత ఇవ్వలేదు. ఒప్పందం ఇంకా పూర్తిస్థాయిలో కుదరలేదని తెలిపారు. కొన్ని విషయాలపై కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని, వాటిపై స్పష్టత వచ్చిన తర్వాతే ఓ ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. దీంతో ప్రకటనతో పరిస్థితులు ఎటు మళ్లుతాయోనన్న ఆందోళన వ్యక్తమవ్వగా, ఇప్పుడు సయోధ్య కుదిరినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడి చేసింది. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా, 250 మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. హమాస్ అగ్రనేత ఇస్మాయెల్ హనియా, అక్టోబర్ 7వ తేదీ నాటి ఘటనకు సూత్రధారి యహ్యా సిన్వార్‌తోపాటు కీలక నేతలను హతమార్చింది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 46,000 మందికి పైగానే పాలస్తానీయులు మృతి చెందారు.