తెలంగాణ

telangana

ETV Bharat / international

'లాహోర్​ ఒప్పందాన్ని మేమే ఉల్లంఘించాం'- తప్పు ఒప్పుకున్న షరీఫ్​ - nawaz sharif lahore declaration

Nawaz Sharif Lahore Declaration : లాహోర్‌ డిక్లరేషన్‌ను తామే ఉల్లంఘించినట్లు పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ వర్గం అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. అది ముమ్మాటికి తప్పేనని ఒప్పుకున్నారు. అప్పటి సైనిక జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ దుస్సాహసానికి ఒడిగట్టడం వల్లనే కార్గిల్‌ యుద్ధం జరిగినట్లు చెప్పారు. తప్పుడు కేసులతో తనను అధికారం నుంచి తప్పించినట్లు ఆవేదన వ్యక్తం చేసిన నవాజ్‌ షరీఫ్‌, కష్టకాలంలో తన సోదరుడు షెహబాజ్‌ షరీఫ్‌ అండగా నిలిచినట్లు చెప్పారు.

Nawaz Sharif Lahore Declaration
Nawaz Sharif Lahore Declaration (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 4:04 PM IST

Nawaz Sharif Lahore Declaration :భారత్‌తో తమ సంబంధాలు దెబ్బతినటానికి స్వయంకృతాపరాధమే కారణమని పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ వర్గం అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. 1999లో భారత్‌తో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘించినట్లు చెప్పారు. అది ముమ్మాటికి తప్పేనని ఆయన అంగీకరించారు. ఆరేళ్ల కాలానికి పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ వర్గం అధ్యక్షునిగా ఎన్నికైన నవాజ్‌ షరీఫ్‌, అనంతరం ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌-పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు మొదలు అధికారం నుంచి ఆయన అర్ధంతరంగా తప్పుకోవటానికి దారితీసిన పరిస్థితుల వరకు అన్నీ వివరించారు. పాకిస్థాన్‌లో ఎన్నికైన ప్రభుత్వం కంటే సైన్యం ఎంత బలమైందో కూడా నవాజ్‌ షరీఫ్‌ ఈ సందర్భంగా బయటపెట్టారు.

భారత్‌కు పోటీగా పాకిస్థాన్‌ 1998 మే 28న 5 అణుపరీక్షలు నిర్వహించినట్లు నవాజ్‌ షరీఫ్‌ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 1999 ఫిబ్రవరి 21న అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయీ పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చినట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య జరిగిన చారిత్రక సదస్సు తర్వాత లాహోర్‌ డిక్లరేషన్‌పై తాను, వాజ్‌పేయీ సంతకాలు చేసినట్లు నవాజ్‌ షరీఫ్‌ చెప్పారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తొలిగి, శాంతియుత వాతావరణం నెలకొల్పటమే లాహోర్‌ డిక్లరేషన్‌ లక్ష్యమని అన్నారు. అది జరిగిన కొన్ని నెలల తర్వాత పాక్‌ సైనిక జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ దుస్సాహసానికి ఒడిగట్టినట్లు వివరించారు. పాకిస్థాన్‌ దళాలు కశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో చొరబడటం, భారత సైన్యం వాటిని అడ్డుకోవడం అది యుద్ధానికి దారితీసినట్లు నవాజ్‌ షరీఫ్‌ చెప్పారు. ఆ యుద్ధంలో పాకిస్థాన్‌ ఓటమి పాలైంది.

'అమెరికా ఆఫర్​కు నో'
అణుపరీక్షలు నిలిపివేస్తే 5బిలియన్‌ డాలర్లు ఇస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ముందుకొచ్చినా తిరస్కరించినట్లు నవాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ లాంటి వారు తన స్థానంలో అధికారంలో ఉంటే, ఆ ప్రతిపాదనకు అంగీకరించేవారని విమర్శించారు. తప్పుడు కేసులో అప్పటి పాకిస్థాన్‌ చీఫ్‌ జస్టిస్‌ తనను అధికారం నుంచి తప్పించినట్లు నవాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి 2017లో తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఐఎస్‌ఐ మాజీ చీఫ్ జనరల్ జహీరుల్ ఇస్లామ్ పాత్ర గురించి నవాజ్‌ షరీఫ్‌ మాట్లాడారు. తనను ఐఎస్ఐ అధికారంలోకి తేలేదని ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేయాలని కోరారు. పాక్‌ సైన్యం పాదాల వద్ద ఇమ్రాన్‌ ఖాన్‌ కూర్చునేవాడని నవాజ్‌ షరీఫ్‌ ఆరోపించారు. తనపై ఉన్నవన్నీ తప్పుడు కేసులని, ఇమ్రాన్‌ఖాన్‌పై ఉన్నవి నిజమైనవన్నారు.

'నా తమ్ముడు అండగా ఉన్నారు'
తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన చిన్న తమ్ముడు, పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అండగా నిలిచినట్లు నవాజ్‌ షరీఫ్‌ తెలిపారు. తమ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించే కుట్రలు జరిగినప్పటికీ షెహబాజ్‌ షరీఫ్‌ తనకు విధేయుడిగానే ఉన్నారని చెప్పారు.

లోయలో పడ్డ బస్సు- 28మంది మృతి- మరో 22మందికిపైగా!

'ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది- సామాన్యులకు హాని జరగకూడదు' ఇజ్రాయెల్​పై అమెరికా ఫైర్! - Israel Hamas War

ABOUT THE AUTHOR

...view details