South Korea Martial Law : దక్షిణకొరియాలో కొన్ని గంటల్లోనే దేశ రాజకీయాలు తలకిందులయ్యాయి. వరుసగా నెలకొన్న ఈ అనూహ్య పరిణామాలు కొరియా వాసులను ఆందోళనకు గురిచేశాయి. ఏకంగా అధ్యక్షుడికి పదవీగండాన్ని తీసుకొచ్చాయి. అకస్మాత్తుగా ఎమర్జెన్సీ విధించి తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల ఆ ప్రకటనను విరమించుకున్న దక్షిణకొరియా అధినేత యూన్ సుక్ యోల్ రాజీనామా చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి.
1980 తర్వాత మళ్లీ ఇప్పుడే
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ యూన్ సుక్ యోల్ మంగళవారం సాయంత్రం 'ఎమర్జెన్సీ మార్షల్ లా' విధించారు. ఉత్తరకొరియా అనుకూల శక్తులను ఏరివేసేందుకు ఇదే సరైన నిర్ణయమని అన్నారు. అధ్యక్షుడి ప్రకటనతో రంగంలోకి దిగిన సైన్యం పార్లమెంటు, ఇతర రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని హుకుం జారీచేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) వెలుపల వేలాది మంది నిరసనకు దిగారు. వారిని భద్రతా బలగాలు అడ్డుకోవడం ఘర్షణలకు దారితీసింది. 1980 తర్వాత దేశంలో మార్షల్ లా విధించడం ఇదే మొదటిసారి.
పార్లమెంట్ ఏకగ్రీవం
మరోవైపు జాతీయ అసెంబ్లీలోనూ ఇదే పరిస్థితి కన్పించింది. అధ్యక్షుడి నిర్ణయాన్ని ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అటు సొంత పార్టీ నుంచి కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మంగళవారం అర్ధరాత్రి సమయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, 'మార్షల్ లా' అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా, పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం మార్షల్ లా అమలు చట్టవిరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు.
వెనక్కి తగ్గిన యూన్
స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో అధ్యక్షుడు యూన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దక్షిణ కొరియా చట్టప్రకారం పార్లమెంటులో మెజారిటీ ఓటు ద్వారా ఎమర్జెన్సీని ఎత్తేయవచ్చు. దీంతో ఎమర్జెన్సీ విధిస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు యూన్ మరో ప్రకటన చేశారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) అత్యయిక పరిస్థితిని అధికారికంగా ఎత్తివేశారు.
రాజీనామా చేస్తారా?
తాజా పరిణామాలతో అధ్యక్షుడిపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. యూన్ తక్షణమే రాజీనామా చేయాలని లేదంటే అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై యూన్ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఆయన పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు అధ్యక్షుడి సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు. ఈక్రమంలోనే బుధవారం జరగాల్సిన తన అధికారిక షెడ్యూల్‌ను కూడా ఆయన రద్దు చేసుకున్నారు.
దక్షిణకొరియా పార్లమెంట్‌లో 300 మంది సభ్యులున్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటూ 2/3 వంతు మెజార్టీ అంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ, ఇతర చిన్న విపక్ష పార్టీలంతా కలిపి 192 మంది ఉన్నారు. అధ్యక్షుడి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మంగళవారం రాత్రి తీసుకొచ్చిన తీర్మానం 190-0తో నెగ్గింది. ఈ పరిణామాలన్నీ చూస్తే యూన్ పదవి నుంచి దిగిపోవడం ఖాయంగానే కన్పిస్తోంది.