Maldives Boy Dies Denial Of Indian Plane :మల్దీవుల ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడు మృతిచెందాడు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడిని భారత్ ఇచ్చిన విమానంలో ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. సరైన సమయానికి ఆస్పత్రికి వెళ్లకపోవడం వల్ల ఆ బాలుడు మృతి చెందాడు. దీంతో మాల్దీవుల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనేక దీవుల సమాహారమైన మాల్దీవుల్లో ఆరోగ్య వసతులు, ఇతర మౌలిక సదుపాయాలు రాజధాని మాలెలోనే ఎక్కువగా ఉంటాయి. ఇతర దీవుల్లో ప్రజలు అత్యవసరమైతే మాలేకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు సరైన రవాణా సదుపాయాలులేవు. ఈ నేపథ్యంలో మాల్దీవులకు గతంలోనే డోర్నియర్ విమానాన్ని భారత్ ఇచ్చింది. ఆ విమానంలో అత్యవసరమైనవారిని మాలెకు తరలించేవారు. అయితే మయిజ్జు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విమాన సర్వీసును పక్కన పెట్టేసింది.
మాల్దీవుల్లోని విల్మింగ్టన్ అనే దీవిలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఒక 14 ఏళ్లు బాలుడికి జనవరి 17న సాయంత్రం స్ట్రోక్ వచ్చింది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా తక్షణమే రాజధాని మాలెకు తరలించాలని వైద్యులు సూచించారు. ఎయిర్ అంబులెన్స్ కోసం బాలుడి తల్లిదండ్రులు మాల్దీవుల ప్రభుత్వ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. మర్నాడు ఉదయం వరకు తమను పట్టించుకున్నవారే లేరని బాలుడి తండ్రి వాపోయాడు. ఎట్టకేలకు ఆ దేశ వైమానికదళం బాలుణ్ని మాలెకు తీసుకెళ్లింది. అప్పటికే 16 గంటల ఆలస్యమైంది. బాలుడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
మొయిజ్జు ప్రభుత్వం విమర్శలు
అత్యవసర సమయాల్లో తరలింపు ప్రక్రియను మాల్దీవుల ప్రభుత్వం 'ఆసంధ కంపెనీ లిమిటెడ్'కు అప్పగించింది. సమాచారం అందిన వెంటనే బాలుడిని మాలెకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించామని ఆసంధ కంపెనీ తెలిపింది. అయితే విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల ఆలస్యమైందని వివరణ ఇచ్చింది. ఐసీయూలో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొంది. ఈ సున్నితమైన విషయాన్ని అర్థం చేసుకోవాలని ఎలాంటి అవాస్తవాలను నమ్మొద్దని ప్రకటన విడుదల చేసింది.
మాల్దీవుల్లో అత్యవసర సమయాల్లో బాధితులను తరలించేందుకు భారత్ ఇచ్చిన డోర్నియర్ విమానాన్ని బాలుడి కోసం ఉపయోగించడానికి ప్రభుత్వం నిరాకరించడం వల్లే జాప్యం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారతదేశంపై అధ్యక్షుడికి ఉన్న శత్రుత్వం కోసం ప్రజల జీవితాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేదని మాల్దీవుల ఎంపీ మీకైల్ నసీమ్ వ్యాఖ్యానించారు.