Modi Address Indians At Moscow: భారత్ గత పదేళ్లలో సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందని పేర్కొన్నారు. రష్యా పర్యటనలో భాగంగా భారత సంతతి వారితో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రసంగించారు. రష్యా పర్యటనకు నేను ఒక్కడినే రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను, దేశ మట్టి వాసనను తీసుకొచ్చానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో సమావేశ మందిరం కరతాళ ధ్వనులతో మార్మోగింది.
'ఇటీవలే మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణం చేశాను. అందుకే మూడు రెట్ల వేగంతో పని చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ప్రపంచంలో అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతా. భారత్ సాధించిన విజయాలను చూసి ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయన్నాయి. ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రయాన్ ప్రయోగం చేశాం. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ గుర్తింపు పొందింది' ప్రధాని మోదీ అన్నారు.
భారతే నెంబర్ వన్
డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ నంబర్ వన్‌గా ఉందని గుర్తు చేసిన ప్రధాని మోదీ స్టార్టప్‌ల్లో ప్రపంచంలోనే మనం మూడో స్థానంలో ఉన్నామన్నారు. 2014లో వందల్లో ఉన్న స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరాయన్నారు. భారత్ రికార్డు స్థాయిలో పేటెంట్లను సాధిస్తోందన్న ప్రధాని మోదీ, భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితిని కల్పించామన్నారు. దేశంలోని ప్రతిఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నామన్న ఆయన ఆత్మవిశ్వాసం భారత దేశానికి అతిపెద్ద ఆయుధమన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యబీమా వ్యవస్థ భారత్‌లోనే ఉందని గుర్తు చేశారు. మన దేశ యువతే నిజమైన ఆస్తి అని మోదీ అన్నారు. ప్రపంచ అభివృద్ధి అధ్యాయాన్ని భారత్ లిఖిస్తోందన్న ఆయన, గత పదేళ్లలో భారత్ సాధించింది కేవలం ట్రైలర్ మాత్రమేనని రాబోయే 10 ఏళ్లలో అసలు సినిమా చూపిస్తామని అన్నారు. అన్ని సవాళ్లను ఎదుర్కోవడం తన డీఎన్‌ఏలోనే ఉందని మోదీ అన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధిలో భారత్ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందన్నారు.